నిందితురాలిని విచారిస్తున్న పోలీసులు, మృతుడు రాజయ్య
చెడు వ్యవసనాలకు బానిసైన ఓ వ్యక్తి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. బతుకు దారిలో వక్ర మార్గాన్ని ఎంచుకున్న మహిళ విచ్చలవిడితనం ఆమె జీవితాన్ని అధఃపాతాళంలోకి నెట్టేసింది. తోటి ఉద్యోగిపై అసూయతో రగిలిన ఓ కార్మికుడి భవిష్యత్ చీకటిమయంగా మారిపోయింది. ఇలా అడ్డదారుల్లో పెనవేసుకున్న బంధాలన్నీ విచ్చిన్నమై వారిపై ఆధారపడిన కుటుంబాలను రోడ్డున పడేశాయి. తాడేపల్లి కొత్తూరులో ఓ ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని హతమార్చిన ఓ మహిళ ఉదంతం బుధవారం బట్టబయలైంది. రాజధాని ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
కొత్తూరు (తాడేపల్లి రూరల్): రాజధాని ప్రాంతమైన తాడేపల్లి కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రియురాలు ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని నెల రోజులపాటు నివాసాల మధ్య సెప్టిక్ ట్యాంక్‌లో దాచింది. మృతుడి బంధువులు మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు బుధవారం తాడేపల్లిలో మృతదేహాన్ని వెలికితీశారు. విజయవాడ పటమట సీఐ కె.దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దామవరపు మండలం రామకృష్ణాపురానికి చెందిన మార్కండి రాజయ్య (35) కుటుంబ పోషణ నిమిత్తం పదేళ్ల క్రితం విజయవాడకు వలస వచ్చాడు. విజయవాడలోని లిక్కర్ డిపోలో ముఠా కార్మికుడిగా పని చేస్తూ స్థిరపడ్డాడు. ఇదే కంపెనీలో మంచిర్యాల జిల్లా బెల్లంకొండకు చెందిన సుధాకర్ కూడా ముఠా పనికి చేరాడు. వీరిద్దరికీ తాడేపల్లికి చెందిన చిక్కల కమలగాయత్రి ముఠా పని వద్ద పగిలిపోయిన సీసా పెంకులు ఏరుకొనే పని చేస్తూ పరిచయమైంది. అవివాహితురాలైన కమలగాయత్రి సుధాకర్‌తో సహజీవనం చేసింది. తర్వాత రాజయ్యనూ పరిచయం చేసుకుని ఒకరికి తెలియకుండా మరొకరితో సహ జీవనం కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. రాజయ్య, సుధాకర్ ఓ సారి విజయవాడ ఆటోనగర్‌లో గాయత్రి విషయంలో ఘర్షణకు దిగారు. ఆ క్రమంలో ఆమె అక్కడ పని మానేసి తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్లలో పని చేస్తూ జీవించసాగింది.
డ్రైవర్ పోస్టు విషయమై పన్నాగం..
లిక్కర్ డిపో మేనేజర్.. రాజయ్యను నమ్మి పర్సనల్ డ్రైవర్‌గా నియమించుకున్నాడు. అనంతరం మేనేజర్ బదిలీ అయ్యాడు. ఆ స్థానంలో వచ్చిన మరో డిపో మేనేజర్.. సుధాకర్‌ను డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. మరో నెలలో పాత డిపో మేనేజర్ రానుండడం, రాజయ్యను డ్రైవర్‌గా పెట్టుకుంటాడని అనుమానంతో కమలగాయత్రి వద్దకు అక్టోబర్ 24న సుధాకర్ వచ్చి రాజయ్యను హతమార్చేందుకు పథకం పన్నారు. కమలగాయత్రి రాజయ్యను గత నెల 29న ఇంటికి పిలిచింది. అనంతరం సుధాకర్, కమలగాయత్రి కలసి రాజయ్య కళ్లలో కారం కొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి, రోకలి బండతో మోది కిరాతకంగా చంపి, దూలానికి ఉరి వేశారు. మృతదేహాన్ని పాత సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చేశారు. రాజయ్య కనిపించలేదని భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సుధాకర్‌ను, కమలగాయత్రిని విచారించగా వారు నోరు మెదపలేదు. పోలీసులు ఫోన్‌కాల్స్ రికార్డుల ద్వారా పునఃవిచారణ నిమిత్తం గాయత్రి ఇంటికి వెళ్లారు. ఆమె నాలుగేళ్ల కుమారుడు నిఖిల్‌తో పోలీసులు మాట్లాడగా ‘మా అమ్మ, మరో వ్యక్తి కలసి రోకలితో ఓ వ్యక్తిని కొట్టి చంపేశార’ని రోకలిని పోలీసులకు చూపాడు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కూపీ లాగారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దామోదర్ తెలిపారు. రాజయ్యకు భార్య సుజాతతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుధాకర్ పరారీలో ఉన్నాడు.
కంటికి కనిపించినంత దూరంలో అమ్మ..పిలిచినా పలక లేదు. అమ్మా అమ్మా అంటూ బిగ్గరగా ఏడ్చాడు. అయితే ఆ పసిమొగ్గ వేదన అరణ్యరోదనగా మారింది. నిందితురాలిని పోలీసులు తీసుకెళుతుండగా కొడుకు ఇలా జీవం లేని కళ్లతో బేలగా చూస్తుండిపోయాడు. తల్లికి ఏమైందో అర్థంగాక, ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలియక, తండ్రి అనే మాట ఏనాడూ నోట రాక ఆ చిన్నోడు దిక్కులేని వాడయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment