పట్టుబడిన బంగారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారుల కళ్లుగప్పి బంగారు అక్రమ రవాణాకు అన్ని ద్వారాలూ మూసుకుపోవడంతో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు స్మగ్లింగ్ దొరలు. మగవారి శరీరంలో, ఆడవారి లోదుస్తుల్లోనూ బంగారు బిస్కెట్లను అట్టే పెట్టేస్తున్నారు. అయితే అధికారులు మరింత హుషారైపోవడంతో చెన్నైలో దాక్కుని ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది.
శ్రీలంక, అరబ్ దేశాలు, దుబాయ్ నుంచి చెన్నైకి భారీ ఎత్తున బంగారు అక్రమరవాణా అవుతున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు ఉప్పందింది. ఈ సమాచారంతో విమానాశ్రయ కస్టమ్స్ అధికారులతో కలిసి ఇటీవల భారీ ఎత్తున నిఘాపెట్టారు. కొన్నిరోజుల క్రితం కొరియా దేశానికి చెందిన ఇద్దరు అందమైన యువతులు నవనాగరీకమైన దుస్తులు ధరించి పర్యాటక వీసాలో చెన్నైకి చేరుకున్నారు. అధికారులు వారిపై అనుమానంతో సోదాలు చేపట్టగా వారి లోదుస్తుల్లో రూ.8.50 కోట్ల విలువైన 24 కిలోల బంగారును చూసి బిత్తరపోయారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. బంగారు బిస్కెట్లు ఎక్కడి నుంచి ఎవరికోసం తీసుకొస్తున్నారు. మీ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరున్నారని విచారించారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా కింద తాము పనిచేస్తున్నామని పలు విషయాలు బయటపెట్టారు. కొరియా యువతులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విమానాశ్రయంలో నిఘా పెంచారు.
అంతేగాక చెన్నై నగరంలోని కొన్ని అనుమానిత ప్రాంతాల్లో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. చెన్నై చూలైమేడులోని ఒక ఇంటిలో అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠానేత ఉన్నట్లు గుర్తించి చుట్టుముట్టారు. ముఠానేత, అతని కుమారుడు సహా నలుగురిని పట్టుకున్నారు. ఆ ఇంటి నుంచి 20.6 కిలోల బంగారు, రూ.21 లక్షల నగదు, వీటిని తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధం చేసుకున్న బీఎండబ్యూ కారును స్వాధీనం చేసుకుని నలుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చే ప్రయాణికులను లోబరుచుకుని లేదా ప్రలోభపెట్టి బంగారును చెన్నైకి తీసుకొస్తున్నామని నిందితులు పోలీసులకు తెలిపారు.
శరీరంలో 235 గ్రాముల బంగారుకస్టమ్స్ అధికారుల కళ్లుగప్పేందుకు ఏకంగాశరీరంలోనే బంగారును అమర్చుకున్న ఘనుడి ఉదంతం బయటపడింది.
మంగళవారం సాయంత్రం శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చిన మహమ్మద్ (26) అనే ప్రయాణికుడిపై అనుమానంతో అతడి లగేజీని కస్టమ్స్ అధికారులు సోదా చేశారు. అయితే ఏమీ దొరక్కపోవడంతో రహస్య గదిలోకి తీసుకెళ్లి మరింతగా తనిఖీలు చేశారు. స్పాంజి ముక్కల మధ్య బంగారు బిస్కెట్లను పెట్టి వాటిని అతడి శరీరంలో అమర్చుకున్న వైనం బయటపడింది. కస్టమ్స్ అధికారులు వైద్యులను పిలిపించి అతడి శరీరం నుంచి రూ.8లక్షల విలువైన 235 గ్రాముల బంగారు బిస్కెట్లను బయటకుతీశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ అ«ధికారి ఒకరు మాట్లాడుతూ, పొంగల్, దీపావళి పండుగ రోజుల్లో రాష్ట్రంలో బంగారు నగల కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతుంటాయని, దీన్ని అవకాశంగా తీసుకునే స్మగ్లర్లు అక్రమరవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రయాణకులనే సాధనాలుగా చేసుకుని అరబ్, దుబాయ్ దేశాల నుంచి చెన్నైకి తరలించారు. అలాగే శ్రీలంక నుంచి సైతం నౌకాయానం ద్వారా వచ్చిచేరిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment