సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో భారీగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోదీ నగర్ జిల్లాలో శుక్రవారం తనిఖీలు చేస్తున్న పోలీసులకు రూ 38 కోట్ల విలువైన 120 కిలోల బంగారం ఓ వాహనంలో పట్టుబడింది. ఢిల్లీ నుంచి యూపీలోని హరిద్వార్‌కు చెందిన ఓ ఫ్యాక్టరీకి బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో ముడి బంగారాన్ని బిస్కెట్‌లుగా మార్చి పలు ప్రాంతాలకు తరలిస్తారని పోలీసులు చెప్పారు.
బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో క్యాషియర్, డ్రైవర్ సహా ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు చెన్నై విమానాశ్రయంలో రూ 6.24 కోట్ల విలువైన 17.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో విమానాశ్రయంలో సోదాలు నిర్వహించగా అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చిన బంగారం పట్టుబడిందని అధికారులు పేర్కొన్నారు. గృహాపకరణాలు, గాడ్జెట్లలో ప్రయాణీకులు బంగారాన్ని దాచారని వారు చెప్పారు. బంగారంతో పాటు రూ 1.1 కోట్ల విలువైన ఐఫోన్లు, స్మార్ట్ వాచీలు,యూఎస్‌బీ చిప్స్, స్టోరేజ్ పరికరాలు, కెమెరా లెన్స్‌లు, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment