దుబాయ్‌ కేంద్రంగా గోల్డ్‌ స్మగ్లింగ్‌ | Gold Smuggling From Dubai to Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రత్యేక సర్జరీలతో ‘క్యారియర్ల’ శరీరంలోకి పసిడి

Published Tue, Feb 26 2019 6:59 AM | Last Updated on Tue, Feb 26 2019 6:59 AM

Gold Smuggling From Dubai to Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: 2015 నవంబర్‌ 12న 4.5 కిలోలు... 2016 మే 20న 3.5కిలోలు... 2017 సెప్టెంబర్‌ 10న 2.44 కిలోలు... 2018 డిసెంబర్‌ 28న 2 కిలోలు... ఇలా గడిచిన మూడు (2015–18) ఆర్థిక సంవత్సరాల్లో శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు అక్షరాలా 163.52 కిలోల అక్రమ రవాణా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కస్టమ్స్‌ విభాగాధికారులు అందజేసిన డేటాలో ఈ మేరకు పేర్కొన్నారు. ఈ ‘స్మగుల్డ్‌’ (వస్తువుల అక్రమ రవాణా) గోల్డ్‌లో 95శాతానికి పైగా దుబాయ్‌ నుంచి ‘దిగుమతి’ అయిందే కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో అనేక మంది పాత్రధారులుగా, నగరానికి చెందిన కొందరు బడా బాబులు సూత్రధారులుగా ఉంటున్నారు. భారత మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో పాటు దిగుమతి సుంకం పైకి, రూపాయి విలువ కిందికి చేరడమే ఈ స్మగ్లర్లకు కలిసి వస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలా చూసినా కిలో బంగారం అక్రమ రవాణా చేస్తే కనిష్టంగా రూ.3లక్షల నుంచి రూ.4లక్షల లాభం ఉంటోందని అంచనా వేస్తున్నారు. 

స్మగ్లర్లకు స్వర్గధామం దుబాయ్‌...   
దుబాయ్‌ ఇప్పటి వరకు కేవలం హవాలా రాకెట్లకు మాత్రమే పేరొందగా... ఇప్పుడు బంగారం అక్రమ రవాణాకూ కేంద్రంగా మారింది. ఆ దేశంలో అసలు  ఆదాయపు పన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్‌ వ్యవహారమే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడి నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడికి పంపి, దాన్ని బంగారంగా మార్చి ఇక్కడికి తీసుకొస్తున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. అతడిపై ఎలాంటి విచారణా ఉండదు. దాన్ని విమానంలోకి తీసుకొచ్చేటప్పుడు కూడా కేవలం చోరీ సొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు.. అధికారులు సైతం అభ్యంతరం పెట్టరు. దీన్ని ఆసరాగా చేసుకొని అక్కడ చాలా తేలిగ్గా విమానంలోకి బంగారాన్ని తరలిస్తున్న స్మగ్లర్లు ఇక్కడ బయటకు తీసుకొచ్చే సమయాల్లోనే పట్టుబడుతున్నారు. 

‘క్యారియర్ల’కు కమీషన్లు...  
ఈ పరిణామాల నేపథ్యంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవాణాకు పాల్పడడం ద్వారా లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగారు. ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ యజమాని, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నిర్వాహకుడు క్యారియర్లను ఏర్పాటు చేసుకొని దందా ప్రారంభించారని ఇప్పటికే కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. వీళ్లు మధ్యవర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీ యువకులు, యువతులు, మహిళలకు కమీషన్‌ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టికెట్లు కొనిచ్చి విదేశాలకు పంపించి, తిరిగి వచ్చేటప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరిని సాంకేతిక పరిభాషలో ‘క్యారియర్లు’ అంటారు. అనేక సందర్భాల్లో ఈ క్యారియర్లు చిక్కుతున్నా సూత్రధారులు మాత్రం పట్టుబడడం లేదు.  

రెక్టమ్‌ కన్సీల్‌మెంట్‌తో...  
అత్యధిక శాతం స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్‌ బాక్సులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పౌడర్‌ డబ్బాలతో పాటు మొబైల్‌ చార్జర్స్‌లోనూ దాచి తీసుకొచ్చేవారు. ఆ తర్వాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తీసుకొచ్చారు. ఆపై రెక్టమ్‌ కన్సీల్‌మెంట్‌ జోరుగా సాగుతోందని గతేడాది వెలుగులోకి వచ్చిన మూడు కేసులు నిర్ధారిస్తున్నాయని కస్టమ్స్‌ అధికారులు పేర్కొంటున్నారు. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా కిలో వరకు బంగారాన్ని పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్‌ పేపర్‌ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. 

క్లైమ్‌ చేయకుంటే వేలమే..
కస్టమ్స్‌ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95శాతం ప్రొఫైలింగ్‌ పద్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్‌ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం తదితర పరిగణలోకి తీసుకొని అనుమానితుల్ని గుర్తిస్తారు. బయటి రాష్ట్రాల్లో జారీ అయిన పాస్‌పోర్ట్స్‌ కలిగిన వారు ఇక్కడ ల్యాండ్‌ అయినా అనుమానించి తనిఖీలు చేస్తారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్‌ బంగారం తనదేనని క్‌లైమ్‌ చేసుకుంటే దాని విలువపై నిర్ణీత శాతం కస్టమ్స్‌ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఇలా క్‌లైమ్‌ చేయాలంటే వైట్‌ మనీ జమ చేయాల్సి ఉండడంతో అనేక మంది వదిలేస్తారు. ఒకవేళ ఎవరూ క్‌లైమ్‌ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైలలోని కస్టమ్స్‌ కార్యాలయాలకు తరలించి, అక్కడ వేలం వేసి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement