దుబాయ్‌ నుంచి ‘గర్భవతిగా’ వచ్చి.. | Woman Arrested Gold Smuggling Case in Shamshabad Airport | Sakshi
Sakshi News home page

‘గోల్డెన్‌’ లేడీస్‌!

Feb 11 2020 8:17 AM | Updated on Feb 11 2020 8:17 AM

Woman Arrested Gold Smuggling Case in Shamshabad Airport - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అతివలు స్మగ్లర్లకూ టార్గెట్‌ అవుతున్నారు. ఎన్నో విధాలుగా ఆశలు చూపి వీరిని క్యారియర్లుగా వినియోగిస్తున్నారు. కస్టమ్స్‌ సహా ఇతర ఏజెన్సీల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్‌ చేస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. ఒక్క ఆదివారమే జిద్దా నుంచి 2.5 కేజీల బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తీసుకువస్తూ నగరానికి చెందిన నలుగురు మహిళలు చిక్కారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.

కస్టమ్స్‌ అధికారుల కళ్ళుగప్పడానికే..
సాధారణంగా స్మగ్లర్లు వీరి కోసం బంగారాన్ని తీసుకుని వచ్చే క్యారియర్లు అనగానే అందరూ పురుషులు అనే భావిస్తుంటారు. దీనికి తోడు మహిళలూ.. అందునా నిండు గర్భంతో, చంకలో పసి పిల్లలతో వచ్చే వారిని అధికారులు అనుమానించం చాలా తక్కువ. ఈ కారణంగానే దుబాయ్‌ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్‌ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్‌ మాట అటుంచితే.. పసిడి తీసుకువచ్చే ఉమెన్‌ క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే గుర్తిస్తున్న స్మగ్లర్లు వారికి ఇచ్చి పంపిస్తున్నారు. మాదకద్రవ్యాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి బంగారం తదితరాలను అప్పగించి పంపిస్తున్నారు.

డీఎఫ్‌ఎమ్‌డీల వద్దా బురిడీ..
వివిధ రూపాల్లో, వివిధ పంథాల్లో ఒంటిపై ఏర్పాటు చేసుకుని బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలను విమానాశ్రయాల్లోని డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్స్‌లు (డీఎఫ్‌ఎండీ) కూడా కొంత వరకు పసిగట్టలేకపోతున్నాయి. ఏదైనా అక్రమరవాణా విషయం కస్టమ్స్‌ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకరిస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్‌ కారణంగా డీఎఫ్‌ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంత వరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం సైతం ఉంటుందనే బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. 

తప్పించుకుంటున్న కీలక వ్యక్తులు..
ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా.. ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్‌ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. కేవలం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్‌/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. 

కస్టమ్స్‌ అధికారుల ముమ్మర కసరత్తు..
బడా స్మగ్లర్లు మహిళల్ని అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళలను ఆపడం, క్షుణ్ణంగా తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్‌ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు    వెళ్లారు.. ఆఖరిసారిగా ఎప్పుడు వచ్చారు.. ఏ వీసాపై వెళ్లారు.. వారి నేపథ్యం ఏమిటి? తదితరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు.  

ఇవిగో ఉదాహరణలు..
దుబాయ్‌ నుంచి ‘గర్భవతిగా’ వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది.  
సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది.  
బ్యాంకాక్, దుబాయ్‌ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.  
సింగపూర్‌ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.  
యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement