సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, వజ్రాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడడం తెలిసిందే. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇలా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న పసిడి, వెండి, వజ్రాలు తదితర విలువైన వస్తువులను తర్వాత ఏం చేస్తారు? అనేది తెలుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనితోపాటు మరికొన్ని ప్రశ్నలను నగరానికి చెందిన ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అడిగితే ఏం సమాధానం వచ్చిందో తెలుసా? ‘‘మా వద్ద సమాచారం లేదు’’అని!! అది చదివి అవాక్కవడం అతని వంతైంది.
పన్ను ఎగ్గొట్టే యత్నంలో..
యూఏఈ, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల నుంచి బంగారం, ఇతర దేశాల నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీని కొందరు విమానాల ద్వారా అక్రమంగా హైదరాబాద్‌కు తెస్తుంటారు. పన్ను ఎగ్గొట్టే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా వీటిని తీసుకొస్తుంటారు. అత్యంత ఆధునిక విధానాల్లో వీటిని తెస్తూ కస్టమ్స్ అధికారుల కంట పడకుండా బురిడీ కొట్టిస్తుంటారు. అయితే, బాడీ స్కానింగ్ తదితర అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చాక.. స్మగ్లర్ల పప్పులు ఉడకడం లేదు. ఇలా పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, కరెన్సీ, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కస్టమ్స్ అధికారులు ఏం చేస్తారు? వీటిని వేలం వేస్తారా? లేక ఇతర శాఖలకు పంపుతారా? కోర్టుకు స్వాధీనం చేస్తారా? అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఇవే ప్రశ్నలను సంధిస్తూ నగరానికి చెందిన రాబిన్ అనే సామాజిక ఉద్యమకారుడు శంషాబాద్‌లోని హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీసుకు, సనత్‌నగర్‌లోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్‌కు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేశాడు.
చెన్నై సీబీఐ లాకర్‌లా అయితే ఎలా?: రాబిన్
తన ప్రశ్నలకు కస్టమ్స్ అధికారులు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంపై ఆర్టీఐ దరఖాస్తుదారుడు రాబిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిత్యం కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటున్న బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వివరాల గురించి ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తుంటాయని, స్వాధీనం చేసుకున్న వాటిన ఏంచేస్తారో ప్రజలకు చెప్పకపోవడం ఏంటని వాపోయాడు. అసలు ఈ వస్తువుల రికార్డు నిర్వహణ సరిగా ఉందా? అని నిలదీశాడు. నిర్వహణ సరిగా లేకపోతే ఇటీవల చెన్నైలోని సీబీఐ కస్టడీ నుంచి దాదాపు 100 కిలోల బంగారం మాయమైన తరహాలో జరిగితే ఏమేం మాయమయ్యాయనే సంగతి ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నాడు.
ఈ తొమ్మిది ప్రశ్నలు సంధించాడు!
(1) 2015 నుంచి 2020 వరకు కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల వివరాలు
(2) స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏయే దేశాలవి?
(3) 2015–2020 వరకు నమోదు చేసిన కేసులు
(4) స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం చేస్తారు?
(5) ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్న వస్తువుల విలువ ఎంత?
(6) సీజ్ చేసిన వçస్తువులను హైదరాబాద్ కస్టమ్స్ వేలం వేస్తుందా?
(7) మీరు నిర్వహించిన వేలంలో విక్రయించిన పది వస్తువులు, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు
(8) వేలం సమాచారం ప్రజలకు ఎలా తెలియజేస్తారు? గత పది వేలంల గురించిన వివరాలు
(9) హైదరాబాద్ కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల్లో ఎన్ని కస్టడీలో ఉన్నాయి? ఇతర విభాగాలు, కోర్టుకు ఎన్నింటిని అప్పగించారు?
Comments
Please login to add a commentAdd a comment