నాగోలు: పల్లీనూనె వ్యాపారం పేరుతో వందలాది మందిని పల్టీ కొట్టించి రూ.100 కోట్లు వసూలు చేసిన కేసులో ప్రధాన నిందితుడు గ్రీన్‌గోల్డ్ బయోటెక్ కంపెనీ ఎండీ జిన్నా కాంతయ్యతో పాటు మరో ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ కేంద్రంగా అక్రమాలకు పాల్పడిన వీరి నుంచి రూ.5 కోట్ల విలువైన స్థిర,చరాస్తులతో పాటు రూ.21.20లక్షల నగదు, 20లీటర్ల పల్లీనూనె, 20లీటర్ల ఖాళీ క్యాన్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్‌బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు.
ఆదినుంచి మోసాలే..
నిజామాబాద్ జిల్లా, సంకేట్ గ్రామానికి చెందిన జిన్న కాంతయ్య అలియాస్ జిన్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు ముంబైలోని లెదర్ కర్మాగారంలో పనిచేసిన ఇతను 1991లో హైదరాబాద్‌కు వచ్చి సొంత వ్యాపారం మొదలు పెట్టాడు. 1995 కోల్‌కతాకు చెందిన మిట బిశ్వాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. సిగ్మా గ్రాఫిక్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ షాప్ నిర్వహించిన అతను ఆ తర్వాత నిజామాబాద్‌లో స్టాపర్స్ వరల్డ్ పేరుతో అగరుబత్తీలు తయారుచేసి విక్రయించేవాడు. నిరుద్యోగ యువతకు అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తానని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి రూ.75వేల చొప్పున వసూలు చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చిన అతను మహాలైఫ్ ఆన్‌లైన్ మార్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2005లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదే సమయంలో తన కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా చేరిన అహల్యారెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఉప్పల్‌లోని ఫిర్జాదిగూడలో అహల్యారెడ్డి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు.
కర్నూలులో 350 ఎకరాలకొనుగోలుకు యత్నం..
ప్రజల నుంచి వసూలు చేసిన సుమారు రూ.150కోట్లతో కర్నూలులో 350 ఎకరాల స్థలం కొనుగోలు చేసేందుకు జిన్నా కాంతయ్య ప్రణాళిక రూపొందించాడు. మార్చి 15 వరకు గోదాం లీజ్ అగ్రిమెంట్ పూర్తి కానుండడంతో కర్నూలులో రియల్ దందాకు సిద్ధమయ్యాడు. ఇతడిపై ఇప్పటికే హైదరాబాద్‌లో ఐదు కేసులు, వరంగల్ అర్బన్‌లో ఒక కేసు, కడపలో రెండు కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. సమావేశంలో జాయింట్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర్‌రావు, ఉప్పల్ ఏసీపీ సందీప్, ఉప్పల్ సీఐ వెంకటేశ్వర్లు, డీఐ రవిబాబు, ఎస్‌ఐ ఆంజనేయలు పాల్గొన్నారు.
ఆకట్టుకునేలా పథకాలు..
జిన్న కాంతయ్య సోదరుడు వెంకటేశ్వర్‌రెడ్డి 2014లో సికింద్రాబాద్‌లో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ కంపెనీ పేరుతో కార్యాలయం ప్రారంభించాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో 2017 వరకు అతను దానిని పట్టించుకోలేదు. 2017 డిసెంబర్‌లో కంపెనీ బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ 2018 జూలైలో కార్యాలయాన్ని ఉప్పల్‌కు మార్చి గోడౌన్‌ను ఏర్పాటు చేశాడు. రెండో భార్య అలేఖ్యారెడ్డి, బావమరిది అనిల్‌రెడ్డి, మేనేజర్ భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రియ సహకారంతో మల్టీలెవల్ మోసాలకు తెరలేపాడు. సూరత్ నుంచి రూ.20వేలకు కొనుగోలు చేసి తెప్పించిన పల్లీనూనె యంత్రాలతో రూ.లక్షల్లో ఆదాయం వస్తుందంటూ ప్రచారానికి తెరలేపాడు. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించుకోవచ్చునని ప్రచారం చేశాడు. ఇందులో భాగంగా రూ.లక్షతో పల్లీనూనె యంత్రాన్ని కొనుగోలు చేస్తే 40 కిలోల పల్లీనూనె, 200 కిలోల పల్లీలు ఇస్తామని చెప్పాడు. పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.10 వేలతో పాటు రూ.5 వేల అలవెన్స్ 24 నెలల పాటు ఇస్తానంటూ మభ్యపెట్టాడు.
రూ.రెండు లక్షల మెషిన్ కొనుగోలు చేస్తే 80 కిలోల నూనె, 400 కిలోల పల్లీలు ఇస్తామని, ఆ పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.20వేలతో పాటు అలవెన్స్ కింద రూ.పది వేలు రెండేళ్ల పాటు చెల్లిస్తామని చెప్పాడు. అగ్రిమెంట్ సమయంలో ప్రజలను నమ్మించేందుకు పిన్ నంబర్లు కూడా కేటాయించేవాడు. తొలుత చేరిన వ్యక్తి మరో ఇద్దరిని చేర్పిస్తే కమీషన్ ఇస్తామని ఆశచూపాడు. ఇదే తరహాలో ఏజెంట్లను నియమించుకుని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో రూ.లక్ష స్కీంలో 1385 మందిని, రూ.2లక్షల స్కీంలో 144మందిని, ఐదు లక్షల స్కీంలో 19 మంది, పదిలక్షల స్కీంలో నలుగురిని చేర్పించాడు. ఆయా స్కీంలలో చేరిన వారికి డబ్బులు ఇవ్వకుండా పల్లీలు, మిషన్లు, అందజేశాడు. తన కంపెనీలో ఉద్యోగులను కూడా ఒక నెలపాటు పనిచేయించుకొని తొలగించేవాడు. దీనిపై సమాచారం అందడంతో సీపీ సూచనమేరకు ఈ బాగోతంపై దృష్టి సారించిన ఉప్పల్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రధాన సూత్రధారి జిన్నా కాంతయ్యతో పాటు కంపెనీ మేనేజర్ భాస్కర్ యాదవ్, లంకప్రియను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న వెంకటేశ్వర్‌రెడ్డి, అలేఖ్యారెడ్డి, అనిల్‌రెడ్డి, అంజయ్యగౌడ్‌లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
Comments
Please login to add a commentAdd a comment