మృతి చెందిన ప్రవీణ్‌కుమార్
ఆ ఇంట మరి కొన్ని గంటల వ్యవధిలో మోగనున్న పెళ్లి భాజాలు..పెళ్లి పనుల్లో ఆ కుటుంబ సభ్యులంతా తలమునకలయ్యారు.. ఇంతలోనే ఊహించని ప్రమాదం ఆ ఇంట పెను విషాదాన్ని నింపింది. వరుని సోదరుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంతో ఆ ఇంట పెళ్లి భాజాలకు బదులు చావు డప్పు మోగింది. ఈ విషాద సంఘటన బుధవారం సాయంత్రం సూరప్పకశంలో చోటుచేసుకుంది.
చిత్తూరు, రేణిగుంట: మండలంలోని సూరప్పకశంకు చెందిన వేలూరు రాజమోహన్‌రెడ్డి, మల్లికకు ఇద్దరు కుమారులు కల్యాణ్ కుమార్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి. గురువారం రాత్రి సమీపంలోని దేశమ్మనగర్‌కు చెందిన ఓ యువతితో కల్యాణ్‌కుమార్‌కు శుక్రవారం తెల్లవారుజామున బ్రాహ్మణపట్టులోని రంగనాథస్వామి ఆలయంలో వివాహం జరగాల్సి ఉంది. కుటుంబీకులంతా పెళ్లి పనుల్లో బిజీ..బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(19) గురువారం రాత్రి ఇంటి ముందున్న రేకుల షెడ్డులో ఇనుప కమ్మీపై ఉన్న టవల్‌ను తీసుకుంటుండగా కరెంటు షాక్‌కు గురై అపస్మారక స్థితిలో కుప్పకూలాడు. అతడిని తిరుపతి మార్గంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతుని కుటుంబీకులు, స్నేహితులు గుండెలవిసేలా రోదించారు. అనూహ్య దుర్ఘటనతో మృతుని సోదరుని వివాహం వాయిదా పడింది. కాగా, మృతుడు తిరుపతిలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం జన సందోహం కన్నీటి నివాళుల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు.
వారం నుంచీ ఊరంతా షాక్
వారం రోజులుగా విద్యుత్ సరఫరాలో న్యూట్రల్ సమస్య తలెత్తడంతో కరెంటు స్విచ్‌లు ఆఫ్ చేసి ఉన్నా ఊరంతా విద్యుత్ సరఫరా అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను ట్రాన్స్‌కో అధికారులకు చెప్పేందుకు ఫోన్‌లో ప్రయత్నించినా స్పందించలేదని, వారి నిర్లక్ష్యం వలనే ఇంత ఘోరం సంభవించిందని స్థానికులు మండిపడ్డారు. తీరా ప్రాణం పోయిన 24గంటలకు ట్రాన్స్‌కో సిబ్బంది గ్రామానికి వచ్చి శుక్రవారానికల్లా బాగు చేస్తామని చెప్పి వెళ్లారని గ్రామస్తులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment