సాక్షి, చెన్నై: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో కామాంధుడికి ఉరిశిక్ష విధిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మరో నిందితుడిని కేసు నుంచి తప్పించారని, పునర్విచారణకు పట్టుబడుతూ కోర్టు ఎదుట మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. అలాగే, కేసు పునర్విచారణకు కోరుతూ ఆ బాలిక తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పునర్విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహిళలు, యువతులు, బాలికలకు భద్రత కల్పించే రీతిలో చట్టాలు కఠినం చేసినా, నేరాల కట్టడికి ప్రత్యేక బృందాలు, ప్రత్యేక టోల్ ఫ్రీలు ప్రకటించినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో రోజుకో చోట, ఎక్కడో ఓ చోట దాడుల ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ అఘాయిత్యాలకు పాల్పడి పట్టుబడే నిందితుల్ని కఠినంగా శిక్షించినప్పుడే నేరాల తగ్గతాయని మహిళా సంఘాలు నినాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల హైదరాబాద్‌లో వెలుగు చూసిన దిశా ఘటన తరువాత మహిళలు, యువతులు, బాలికలు, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడే వారిని మరింత కఠినంగా శిక్షించడంతో పాటు, ఇది వరకు దాఖలైన కేసుల విచారణల్ని త్వరిత ముగించే దిశగా జిల్లాల ఎస్పీలకు డీజీపీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం సాగిన లైంగిక దాడి కేసు విచారణను ఆధారాలతో సహా పోలీసులు కోర్టులో నిరూపించడం విశేషం. అదే సమయంలో ఈకేసులో మరో నిందితుడిని తప్పించిన్నట్టుగా ఆరోపణలు బయలు దేరడం వివాదానికి దారి తీసింది.
అదృశ్యం...మరుసటి రోజే మృతదేహంగా.
కోయంబత్తూరు పన్నిమడైకు చెందిన ఓ దంపతుల కుమార్తె (7) ఈ ఏడాది మార్చి 25వ తేదీన అదృశ్యమైంది. బిడ్డ కోసం గాలించినా ఫలితం శూన్యం. దీంతో ఆ దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ మరుసటి రోజే ఆ దంపతుల ఇంటికి కూత వేటు దూరంలో బాలిక మృతదేహం పడి ఉండడం కలకలం రేపింది. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినట్టు విచారణలో తేలింది. డీఎన్‌ఏ పరిశోధనలకు సైతం పోలీసులు చర్యలు తీసుకున్నారు. విచారణను ముమ్మరం చేయగా, తొండముత్తూరుకు చెందిన సంతోష్‌కుమార్ చిక్కాడు. బాలిక మృత దేహం పడి ఉన్న ప్రదేశానికి కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలికి సాయంగా ఉంటూ వచ్చిన సంతోష్‌కుమార్ నిందితుడిగా తేల్చారు.
ఎనిమిది నెలల్లో.....తీర్పు
అన్ని రకాల ఆధారాల్ని సేకరించిన కోయంబత్తూరు పోలీసులు నిందితుడ్ని కటకటాల్లోకి నెట్టారు. కోయంబత్తూరులో పోక్సో కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక మహిళా కోర్టులో గతవారం వాదనను ముగించింది. కోర్టులో పోలీసులు సమర్పించిన అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్ములం మేరకు న్యాయమూర్తి శుక్రవారం సాయంత్రం తీర్పు ఇచ్చారు. నిందితుడు సంతోష్‌కుమార్‌కు ఉరి శిక్ష విధించారు. ఆ బాలికను హత్య చేసినందుకు ఉరి శిక్ష, పోక్సో చట్టం కింద నమోదైన కేసులకు యావజ్జీవ శిక్ష, ఆధారాల్ని రూపు మాపేందుకు చేసిన ప్రయత్నానికి ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సర్వత్రా ఆహ్వానించారు. మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
అయితే, ఆ కోర్టు ఎదురుగా మహిళా సంఘాలు తీర్పును ఆహ్వానిస్తూ, ఈ కేసులో మరో నిందితుడ్ని పోలీసులు తప్పించి ఉన్నట్టు ఆరోపిస్తూ, ఆ సంఘాలు ఆందోళనకు దిగాయి. డీన్‌ఏ పరిశోధన నివేదికలో ఆ బాలిక మీద లైంగిక దాడికి ఇద్దరు పాల్పడినట్టు పేర్కొన బడి ఉందని, అయితే, ఒకర్ని మాత్రే అరెస్టు చేసి , కేసును ముగించి ఉన్నట్టు ఆరోపించారు. అదే సమయంలో కేసును పునర్విచారణకు ఆదేశించాలని, మరో నిందితుడు సైతం శిక్షించబడాలని కోరుతూ, బాధిత కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణించిన న్యాయమూర్తి ఆ పరిశోధన నివేదిక ఆధారంగా పున్వరిచారణకు ఆదేవించారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు, కుటుంబీకులతోపాటు మహిళాసంఘాలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment