
జక్కేపల్లి శివారులో పొలంలో దాచిఉంచిన కారు
యాలాల: మండల పరిధిలోని జక్కేపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు గుర్తించారు. అయితే ఆటోను ఢీకొని వేగంగా వెళ్లిపోయిన కారు, జక్కేపల్లి శివారులోని ఓ పొలంలో కారుపై టార్ఫాలిన్ కవర్, గడ్డికప్పి ఉంచి తప్పించేందుకు యత్నించినప్పటికి గ్రామస్తులు, పోలీసులు కారును పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన చంద్రకాంత్‌రెడ్డి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బుధవారం సాయంత్రం స్విఫ్ట్‌కారు (టీఎస్07 ఈకే 4509)లో యాలాల నుంచి తాండూరు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో బెన్నూరు నుంచి జోగు సదానందం అలియాస్ సతీష్, అమృతయ్యతో కలిసి ఆటోలో యాలాల వైపు వెళ్తున్నారు. అయితే జక్కేపల్లి శివారులో కారు ఆటోను ఢీకొనడంతో సదానందం అక్కడికక్కడే మృతి చెందగా, అమృతయ్యకు గాయాలయ్యాయి.
కాగా ఘటన జరిగిన అనంతరం కారు వేగంగా జక్కేపల్లి వైపు వెళ్లిపోయిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెన్నూరు ఎంపీటీసీ లక్ష్మయ్యతో పాటు వార్డు సభ్యులు, యువకులు పోలీసుల సహాయంతో బుధవారం రాత్రి వరకు గుర్తుతెలియని వాహనం కోసం ముకుందాపూర్, జక్కేపల్లి, గిరిజాపూర్ వరకు జల్లెడపట్టారు. అయితే జక్కేపల్లి గ్రామానికి చెందిన యాదవరెడ్డి పొలంలో ప్రమాదానికి కారణమైన కారు ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఆటోను ఢీకొన్న కారు ముందుభాగం దెబ్బతిని ఉండటంతో పాటు కారుపై టార్ఫాలిన్ కవర్, గడ్డి కప్పి ఉంచినట్లు గుర్తించారు. అనంతరం కారును పీఎస్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన చంద్రకాంత్‌రెడ్డితో పాటు కారును దాచిపెట్టడానికి సహకరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment