బిచ్చగత్తెను కాల్చేశారు... | Homeless Woman Is Shot Dead In Brazil | Sakshi
Sakshi News home page

బిచ్చమడిగితే కాల్చేశాడు!

Published Thu, Nov 21 2019 5:37 PM | Last Updated on Thu, Nov 21 2019 5:45 PM

Homeless Woman Is Shot Dead In Brazil - Sakshi

బ్రెజిల్‌లోని రీయో డీ జెనిరో నగరంలో పట్టపగలు ఓ ఘోరం జరిగి పోయింది. ఇల్లూ వాకిలి లేక రోడ్డు మీద భిక్షమెత్తుకునే 31 ఏళ్ల జిల్దా హెన్రిక్‌ డాస్‌ సంతోష్‌ లియోనార్దో ‘ఆకలవుతోంది. 25 సెంట్లు ఇవ్వండి ప్లీజ్‌..బన్ను కొనుక్కుంటా!’ అంటూ ఓ బాటసారి వెనకాల పడింది. ఆమె వైపు చూడకుండానే ఆ బాటసారి ‘చీ పో!’ అంటూ ఓ సారి కసురుకున్నాడు. ఆమె వినిపించుకోకుండా ఆయన పక్కకు వచ్చి మళ్లీ చేయి చాపడంతో చిర్రెత్తి పోయిన అతగాడు బొడ్డు లోనుంచి రివాల్వర్‌ తీసి నేరుగా ఆమెను కాల్చాడు. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లే లోగానే ఆమె ప్రాణం పోయింది. 

అంతకు నాలుగు గంటల ముందే ఆ ప్రాంతంలోనే నలుగురు భిక్షగాళ్లు విష ప్రయాగానికి మరణించారు. ఆ నేపథ్యంలో బిచ్చగత్తెను కాల్చేశారన్న వార్త సంచలనం సృష్టించింది. ఏడుగురు పురుషులు, ఒక యువతి ఉన్న బృందం  ఓ మద్యం బాటిల్‌ను రోడ్డు ఫుట్‌పాత్‌పై ఉన్న భిక్షగాళ్లకు ఇచ్చి పోయారట. అందులోని మద్యాన్ని తాగిన ఎనిమిది మంది భిక్షగాళ్లు తీవ్రంగా అస్వస్థులయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా నలుగురు చనిపోగా, మరో నలుగురు ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. డ్రగ్‌ మాఫియా ఆ మద్యం బాటిల్‌ను ఇచ్చిందా? మరెవరైనా బిచ్చగాళ్ల నిర్మూలనకు ఇలా చంపుతున్నారా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

ఇక బిచ్చగత్తెను హత్యచేసిన బాటసారిని సీసీ కెమేరాల ద్వారా 39 ఏళ్ల అడెర్బాల్‌ రామోస్‌ డీ కాస్ట్రోగా గుర్తించి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ రోడ్డు మీద భిక్షగాళ్ల బెడద ఎక్కువగా ఉందని, తాను ఆ రోడ్డు మీద వెళ్లినప్పుడల్లా వేధిస్తుంటారని, ఆ రోజు సొంతంగా ఓ హోటల్‌ను ఏర్పాటు చేయడం కోసం డబ్బును తీసుకెళుతుంటే ఆమె వెంట పడటంతో డబ్బెక్కడ దోచుకుపోతుందోనన్న భయంతో కాల్పులు జరిపానని అతడు వాదిస్తున్నారు. సీసీ టీవీ కెమేరాలోని దృశ్యాలను చూస్తే అడెర్బాల్‌ వాదన తప్పని తెలుస్తోంది. గత శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement