
మావూరి శివభూషణం (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: రాజధాని నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను కొట్టేయడానికి దీపక్‌రెడ్డి, శైలేశ్ తదితరులు భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో ‘పరిచయం’చేస్తూ సదరు స్థలంపై జీపీఏలు, సేల్‌డీడ్లు తయారు చేయించారు. అతడికి వందల్లో చెల్లిస్తూ కోర్టులకు బోగస్ పేర్లతో తిప్పి వందల కోట్ల స్థలాలను కబ్జా చేసే కథ నడిపారు.
అత్తాపూర్‌లోని రామ్‌బాగ్ ప్రాంతానికి చెందిన శివభూషణం ఎంజే మార్కెట్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వివిధ రకాలైన పత్రాలు విక్రయిస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే తరచుగా అక్కడకు వచ్చే మొఘల్‌పురకు చెందిన న్యాయవాది శైలేశ్ సక్సేనాతో 2000లో ఇతడికి పరిచయమైంది. తనకు అవసరమైనప్పుడల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి తాను చెప్పిన పేరుతో సంతకాలు చేయాలని కోరడంతో శివభూషణం అంగీకరించాడు. దీనికి ప్రతిఫలంగా శివభూషణంకు ఉన్న అప్పులు తీర్చడంతో పాటు కుమార్తె, కుమారుడి వివాహాలకు అవసరమైన సాయం చేస్తానంటూ శైలేశ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2004లో గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో ఉన్న రూ.300 కోట్లకు పైగా ఖరీదైన 78 ఎకరాల రెండు గుంటల స్థలంపై శైలేశ్ కన్నేశాడు.
ఈ స్థలాన్ని దాని యజమాని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ తనకు విక్రయించినట్లు రికార్డులు రూపొందించి సివిల్ సూట్స్ వేశాడు. తాను నిర్వహిస్తున్న స్థల యజమాని ఇస్లాం ఖాన్ లేడని, కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడానికి అతడి సంతకాలు కావాలంటూ శివభూషణంతో శైలేశ్ చెప్పాడు. దీనికి ముందే ఇక్బాల్ ఇస్లాంఖాన్ తన పేరిట రాశాడంటూ ఓ బోగస్ జీపీఏ సృష్టించిన శైలేశ్ దాన్ని శివభూషణానికి చూపాడు. ఇక్బాల్ ఇస్లాంఖాన్‌గా నటించేందుకు శివభూషణం అంగీకరించడంతో బోగస్ పత్రాల ఆధారంగా 2004లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో భోజగుట్ట స్థలానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన శైలేశ్... శివభూషణాన్ని కోర్టుకు తీసుకువెళ్ళి ఇక్బాల్ ఇస్లాంఖాన్‌గా చూపించారు. న్యాయస్థానంలో ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా సంతకాలు సైతం చేయించారు.
కోర్టు వాయిదాలు ఉన్నప్పుడల్లా శివభూషణాన్నే ఇస్లాం ఖాన్‌గా న్యాయస్థానానికి హాజరయ్యేలా శైలేశ్ ఏర్పాట్లు చేశాడు. ఈ సమయంలో అతడి వెంట సక్సేనా అనుచరుడితో పాటు దీపక్‌రెడ్డి కూడా ఉండేవారు. ఒక్కో వాయిదాకు రూ.500 నుంచి రూ.700 శివభూషణంకు చెల్లించేవాడు. 2006 మార్చిలో దీపక్, శైలేశ్‌లు మరోసారి శివభూషణాన్ని ఉపయోగించుకున్నారు. గుడిమల్కాపుర్‌లో ఉన్న 78 ఎకరాల 22 గుంటలు, మాదాపూర్‌లోని ఎకరం స్థలంపై వీరి కన్ను పడింది. శివభూషణంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఈ స్థలాలను ఎన్‌హెచ్ శైలజ, బి.ప్రకాశ్‌చంద్ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. వీటిపై శివభూషణంతో పాటు శైలేశ్ సక్సేనా, దీపక్‌రెడ్డి తీసుకువచ్చిన మరో ఐదుగురు వ్యక్తులు సంతకాలు చేశారు.
అతడే ఖాన్.. అతడే ఠాకూర్
వివిధ సందర్భాల్లో వినియోగించడానికి శివభూషణానికి బోగస్ గుర్తింపు కార్డు అవసరమైంది. దీంతో శైలేశ్, దీపక్‌రెడ్డి సంయుక్తంగా శివభూషణం ఫొటోతో, రాధాకృష్ణన్ ఠాకూర్ పేరుతో బోగస్ ఓటర్ ఐడీ రూపొందించారు. దీని ఆధారంగా శివభూషణాన్ని ఠాకూర్‌గా మార్చే శారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.12లో ఉన్న రూ.100 కోట్ల ఖరీదైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’ఈ ఐడీని వాడారు. శివభూషణంను హైదరా బాద్ (సౌత్) జాయింట్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీస్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సదరు స్థలాన్ని విక్రయిస్తున్నట్లు ఠాకూర్ పేరుతో శివభూషణం సంతకం చేయగా, ఖరీదు చేస్తున్నట్లు దీపక్‌రెడ్డి సంతకం చేశారు. దీనికి ప్రతిఫలంగా శైలేశ్ రూ.వెయ్యి శివభూషణంకు ఇచ్చాడు. జీపీఏలో పొరపాటు దొర్లిందని చెప్పిన సక్సేనా 2008 అక్టోబర్‌లో మరోసారి శివభూషణంను రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించాడు. దీపక్‌రెడ్డి పేరుతో మరో డీడ్ చేయించి రూ.500 చెల్లించాడు. ఈ వ్యవహారాలకు సంబంధించి నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గతేడాది శివభూషణంని అరెస్టు చేశారు.
మావూరి శివభూషణం మృతి
దీపక్‌రెడ్డి కబ్జాల కేసులో కీలక నిందితుడు
భోజగుట్టసహా నగరంలో ఉన్న రూ.వందల కోట్ల భూములకు ‘పేపర్ యజమాని’, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేశ్ సక్సేనాలు రంగంలోకి దింపిన ‘నకిలీ దాదా’మావూరి శివభూషణం మంగళవారం మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అత్తాపూర్‌లోని ఇంట్లో చనిపోయాడు. భోజగుట్ట భూ కబ్జా కేసులో దీపక్‌రెడ్డి, శైలేశ్‌లతో పాటు గతేడాది సీసీఎస్ పోలీసులకు భూషణం చిక్కాడు. కాగా ఈ కేసుపై సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘సాధారణంగా ఎలాంటి కేసులోనూ నిందితులు న్యాయమూర్తి ముందు తమ నేరం అంగీకరిస్తూ వాంగ్మూలం (164 స్టేట్‌మెంట్) ఇవ్వరు. అయితే శివభూషణం మాత్రం గతంలోనే న్యాయస్థానంలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసు విచారణపై ఆయన మరణ ప్రభావం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇతడికి కుమారుడిగా నటించిన బషీర్ సైతం ఈ కేసుల్లో కీలకం’అని మహంతి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment