
సూసైడ్ నోట్ రాఘవేంద్ర, ఆరతిల మృతదేహాలు
కర్ణాటక, చెళ్లకెరె రూరల్: నగరంలోని వాసవినగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. రాఘవేంద్ర(43), ఆరతి(35) అనే దంపతులు నగరంలోని బెంగళూరు రోడ్డులో దత్తా కిరాణి అండ్ జనరల్ స్టోర్స్ నడుపుతున్నారు. వీరికి ఎనిమిదో తరగతి చదువుతున్న రమ్య అనే కుమార్తె ఉంది.సాయంత్రం రమ్య ట్యూషన్‌కు వెళ్లిన సమయంలో దంపతులిద్దరూ తమ చావుకు తామే కారణమని ఇంటిలోనే డెత్‌నోట్ రాసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ట్యూషన్ నుంచి రమ్య ఇంటికి వచ్చి చూడగా వీరి ఆత్మహత్య విషయం బయట పడింది. కాగా వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో ఇంకా తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే చెళ్లకెరె పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.