మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
నెల్లూరు, కావలి: వారిద్దరూ ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు అభ్యంతరం చెప్పినా 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. వారి చదువుల కోసం కావలి పట్టణంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మంగళవారం ఆమె గొంతునులిమి చంపేశాడు. కావలి పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యుల కథనం మేరకు.. కొండాపురం మండలం నేకునాంపేట గ్రామానికి చెందిన నలగట్ల ప్రకాశరావు, అదే మండలంలోని తూర్పుపాళెం గ్రామానికి చెందిన రాధలు కావలి పట్టణంలోని వాయునందనప్రెస్ వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ప్రకాశరావు ప్రైవేట్‌గా పనులు చేసేవాడు.
భార్యపై అనుమానంతో అతను నిత్యం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తుండేవాడు. చంపేస్తానని హెచ్చరిస్తుండేవాడు. ఈ విషయాన్ని రాధ తన తల్లిదండ్రులకు పలుమార్లు చెప్పి బాధపడింది. ప్రేమించి పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నానని చెబితే తాము మాత్రం చేయగలిగింది ఏముంటుందని, సర్దుకుపోవాలని వారు నచ్చజెప్పేవారు. రాధ కూడా పిల్లల చదువుల కోసం కావలి పట్టణానికి వచ్చి ఉంది. వారి పిల్లల భవిష్యత్ కోసం భర్త పెట్టే హింసను భరించింది. కాగా వారి ఇద్దరు పిల్లలు మంగళవారం యథాప్రకారం పాఠశాలకు వెళ్లారు. కాసేపటికి తర్వాత ఇంటికి వచ్చిన ప్రకాశరావు భార్యతో ఘర్షణ పెట్టుకొని, ఆమె గొంతు నులమడంతో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న కావలి డీఎస్పీ డి.ప్రసాద్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను ఆరా తీశారు. కావలి వన్ టౌన్ సీఐ ఎం.రోశయ్య మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాపం పిల్లలు
స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు తల్లి మృతదేహం కనిపించింది. తల్లి మరణించిందని తెలిసి వారు అమ్మా...అంటూ విలపించడం స్థానికులు కండతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment