గణేష్ మృతదేహం
విశాఖ క్రైం: పూటుగా మద్యం సేవించి భార్యతో గొడవ పడిన సంఘటనలో భార్య ఒక్కసారిగా తోయడంతో కిందపడి భర్త మృతి చెందాడు. ఈ ఘటన నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అక్కయ్యపాలెం చిన్నూరు మసీదు వద్ద భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో ఏలూరు గణేష్ (33) నివాసముంటున్నాడు. గణేష్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి రావడంతో భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో గణేష్ పూటుగా మద్యం సేవించి సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. భార్య తలుపు తీయకపోవడంతో... తలుపు తీయకపోతే నిన్ను చంపేస్తానని కేకలు పెట్టాడు. దీంతో లక్ష్మి తలుపులు తీసింది.
కోపంతో రెచ్చిపోయిన గణేష్ భార్యను చంపేస్తానంటూ గ్యాస్ సిలిండర్ పైపు తీశాడు. ఇద్దరి మధ్య తెల్లవారిజాము 2 గంటల వరకూ గొడవ కొనసాగింది. లక్ష్మి భయపడి భర్తను గట్టిగా తోసి ఇంటి నుంచి బయటకు వచ్చి తాళం వేసి అదే ప్రాంతంలో ఉంటున్న అత్త త్రినాథమ్మ ఇంటికి వెళ్లిపోయింది. అత్తకు జరిగిన సంఘటన పూర్తిగా వివరించింది. అత్తతో కలిసి ఉదయం 7.30 గంటల సమయంలో తన ఇంటికి వెళ్లి తాళం తీసి చూసేసరికి భర్త మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. తల భాగం నుంచి రక్తం రావడాన్ని గురించారు. వెంటనే మృతుడి తల్లి త్రినాథమ్మ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ తిరుమలరావు ఆదేశాల మేరకు ఎస్‌ఐ శివ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునిపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment