ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంధ్య తల్లి చేతిలో హతమైన బాలుడు
తొర్రూరు: కుటుంబ కలహాలు వివాహిత, ఏడాది వయసున్న కుమారున్ని బలి తీసుకున్నాయి. తరుచూ జరుగుతున్న గొడవలతో విరక్తి చెందిన ఓ వివాహిత కుమారుని గొంతు నులిమి ఆపై తాను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణం తీసుకుంది. ఈ విషాద ఘటన మండల పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం..మండలంలోని గుర్తూరు గ్రామంలో చెట్టబోయిన సంధ్య(26), భర్త అశోక్ నివాసం ఉంటున్నారు. అశోక్ ఆటో నడపగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి 13 నెలల బాబు రిత్విక్ ఉన్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా అత్త వెంకటమ్మ, భర్తతో గొడవలు అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గొడవల నేపథ్యంలో నెల రోజులుగా అమ్మగారి ఊరైన పెద్దవంగర మండలం పోచంపల్లికి సంధ్య వెళ్లింది. ఈ నెల 7న అశోక్ అత్తగారింటి వెళ్లి ఇకపై ఎలాంటి గొడవలు ఉండవని పెద్దమనుషుల సమక్షంలో నచ్చజెప్పి భార్యను కాపురానికి తీసుకొచ్చాడు.
కుమారున్ని చంపి.. ఉరి వేసుకుని..
వేకువజామున లేచి కల్లాపి చల్లి కుమారున్ని నిద్ర నుంచి లేపింది. భర్త అశోక్ ఉదయాన్నే లేచి అల్పాహారం తీసుకొచ్చేందుకు రోడ్డుకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన సం«ధ్య ఎవరూ లేని వేళ తలుపులు బిగించి ఆడుకుంటున్న బిడ్డను గొంతునులిమి కడతేర్చి, ఆపై తాను అదే గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. భర్త వచ్చి తలుపు కొట్టగా ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి చూడగా కుమారుడు, భార్య విగతజీవులుగా కనిపించారు. దీంతో భర్త ఒక్కసారిగా బోరుమన్నాడు. అత్తకు దూరంగా వేరు కాపురం ఉందామని భర్తతో ఎన్నిమార్లు చెప్పినా వినకపోవడంతోనే సంధ్య ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ మదన్‌లాల్, సీఐ చేరాలు, ఎస్సై నగేష్‌లు పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల్లీకొడుకు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment