
పోలీసులు స్వాధీనం చేసుకున్న కొడవలి ,పార్వతి మృతదేహం
పీలేరు: భర్త చేతిలో ఓ మహిళ దారుణంగా హత్యకు గుౖరైంది. పీలేరు మండలంలోని రేగళ్లు పంచాయతీ బోయపల్లెలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. బోయపల్లెకు చెందిన సుబ్రమణ్యం (45), పార్వతి (40) దంపతులు. వీరు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు వెంకటేష్, అశ్వినిలు కొడుకు, కుమార్తెలు. వీరిరువురికీ వివాహాలు అయ్యాయి. పార్వతి జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లి ఆరునెలల క్రితం గ్రామానికి తిరిగొచ్చింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటుండేవని తెలిసింది.
గురువారం మధ్యాహ్నం కూడా మరోమారు తగాదా జరిగినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన సుబ్రమణ్యం కొడవలితో పార్వతి తల, మెడపై కిరాత కంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై కిందపడిన పార్వతి సంఘటనాస్థలంలోనే మృతి చెందింది. గుర్తించిన స్థానికులు విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పీలేరు సీఐ వేణుగోపాల్, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పరారైన సుబ్రమణ్యం కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.