
మహేశ్వరి(ఫైల్) తల్లి మృతితో అనాథ అయిన చిన్నారి
కర్నూలు, పత్తికొండ టౌన్: పట్టణంలో ఓ వివాహిత గురువారం కట్టుకున్న భర్త చేతిలోనే దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక మడ్డిగేరి కాలనీకి చెందిన సూర్యనారాయణ, భూషమ్మ దంపతుల కుమార్తె మహేశ్వరిని చక్రాళ్లరోడ్డు కొండగేరిలో నివాసం ఉంటున్న నాగభూషణం, సంజమ్మ దంపతుల కుమారుడు రవికి ఇచ్చి రెండేళ్లక్రితం వివాహం చేశారు. వీరికి 8 నెలల కూతురు ఉంది. రవి, మహేశ్వరి దంపతులు జీవనోపాధి కోసం రాజంపేటకు వలస వెళ్లారు. బంధువులు గద్దెరాళ్ల దేవర చేస్తుండటంతో వారం రోజుల క్రితం స్వగ్రామం పత్తికొండకు వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యాభర్త గొడవపడ్డారు. భర్త రవి, అత్తమామలు మహేశ్వరిని తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.
అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఉదయం ఏమీ తెలియని వారి మాదిరిగా ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్పి, మహేశ్వరి మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యసిబ్బంది ధ్రువీకరించారు. తమ కూతురు మహేశ్వరిని పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు నిత్యం అనుమానంతో శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, వారే కొట్టిచంపారని మృతురాలి తండ్రి సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ విజయకుమార్ పోలీసు సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి మహేశ్వరి మృతదేహాన్ని పరిశీలించారు. భర్త రవి, అత్తమామలు నాగభూషణం, సంజమ్మలను అదుపులోకి తీసుకుని పోలీసుశైలిలో విచారించడంతో హత్యానేరం అంగీకరించారు. ఈ మేరకు వారిపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణయ్య తెలిపారు. కాగా తల్లి మృతిచెందడం, తండ్రిని పోలీసులు అరెస్టు చేయడంతో ఏ పాపం ఎరుగని 8నెలల చిన్నారి అనాథగా మిగలడాన్ని చూసిన పలువురు చలించిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment