
నిందితులు సదయ్య, స్వామి
బంజారాహిల్స్: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో పీకలదాకా మద్యం తాగించి పథకం ప్రకారం ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ, జవహర్‌నగర్‌కు చెందిన సదయ్య కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. హన్మకొండకు చెందిన అతడి దూరపు బంధువు రాంబాబు గత కొంతకాలంగా తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా సదయ్య అనుమానం పెంచుకున్నాడు.
ఈ విషయమై పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించాడు. అయినా వీరి వైఖరిలో మార్పు రాకపోవడంతో రాంబాబును అంతమొందించాలని సదయ్య పథకం పన్నాడు. ఇందులో భాగంగా శనివారం రాంబాబుకు ఫోన్ చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా విందు ఇస్తానని చెప్పడంతో రాంబాబు నగరానికి వచ్చి సదయ్యకు ఫోన్ చేశాడు. ఇద్దరూ కలిసి సమీపంలో ఉంటున్న సదయ్య బావ స్వామి ఇంటికి వెళ్లగా ముగ్గురు కలిసి మద్యం తాగారు. రాంబాబుకు బలవంతంగా ఎక్కువ తాగించిన సదయ్య పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి గొంతుకోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రాంబాబును స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సదయ్య, అతడి బావ స్వామిలపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్టు చేశారు.