న్యాయం చేయాలని కోరుతున్న సరస్వతి
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ప్రేమించి, పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటు కాపురం చేసిన భర్త తక్కువ కులమని తనను వదిలేసి మరో వివాహానికి సిద్ధమయ్యాడని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను మందలించి, కాపురాన్ని నిలబెట్టాలని కోరుతూ శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వేడుకుంది. ఆమె కథనం మేరకు.. కురబలకోట మండలం తెట్టు పంచాయతీ చింతమాకులపల్లెకు చెందిన సరస్వతికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. మదనపల్లె రామారావు కాలనీ పోలేరమ్మ గుడి వీధికి చెందిన ప్రవీణ్‌కుమార్ ఫోన్ కాల్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. తర్వాత మాటలు కలిసి వ్యవహారం ప్రేమ వరకు వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. కులాలు వేరని, వివాహాన్ని పెద్దలు అంగీకరించని చెప్పినా వినకుండా గత ఏడాది ఏప్రిల్ 4న చింతమాకులపల్లెలో పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు.
రామారావు కాలనీలో రెండు నెలల పాటు సజావుగా సాగిన తమ కాపురంలో భర్త ప్రవీణ్ తాగుడుకు అలవాటు పడటం, కొట్టడం, హింసించడం, సూటిపోటి మాటలతో అలజడి మొదలైందని బాధితురాలు సరస్వతి వాపోయింది. అమ్మచెరువుమిట్టలో తన పేరున ఉన్న భూమిని రూ.3.80లక్షలకు అమ్మి జల్సా చేసేశాడంది. అత్తామామలతో కలిసి తక్కువ కులందానివని తనను దూషిస్తూ, నీతో కాపురం చేయాలంటే రూ.10లక్షల కట్నం ఇవ్వాలంటూ బయటకు నెట్టేశారని తెలిపింది. ఈ విషయమై ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో న్యాయంకోసం ప్రెస్‌క్లబ్‌ను ఆశ్రయించానంది. తన భర్తకు అత్తామామలు రెండో వివాహం చేసినట్లు తెలిసినవారు చెప్పారని, అదే జరిగితే తనకు మరణం తప్ప మరోదారి లేదని కన్నీరుపెట్టుకుంది. తన భర్తను పిలిపించి, తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది. బాధితురాలు సరస్వతికి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, ఏఐటీయూసీ చేనేత కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్ మద్దతు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేంతవరకు అండగా నిలుస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment