
సాక్షి, తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ ప్రబుద్ధుడికి భార్యను వదిలేసి.. మరదల్ని పెళ్లి చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది. దీంతో భార్యను హింసించడం మొదలుపెట్టాడు. చివరకు ఆమెను చంపేందుకు కూడా వెనుకాడలేదు. చివరకు విసిగిపోయిన ఆ భార్య.. అతనికి దేహశుద్ధి చేసి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాలు.. నులకపేటకు చెందిన షేక్ మరియమ్మకు ఐదేళ్ల కిందట ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన సైదాబాబుతో వివాహమైంది. భర్త చిత్రహింసలు పెడుతుంటంతో మరియమ్మ రెండేళ్ల కిందట నులకపేటలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. దీంతో ఇకపై బుద్ధిగా ఉంటానంటూ సైదా ఏడాది కిందట అత్తారింటికి వచ్చాడు. అప్పట్నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో అతని కన్ను మైనర్ అయిన మరదలిపై పడింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి మరదలికి ఇచ్చాడు. స్పృహ కోల్పోగానే ఆమెను వివస్త్రను చేసి వీడియోలు, ఫొటోలు తీశాడు. అప్పట్నుంచి మరియమ్మను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ బాలికతో తనకు వివాహం చేయకపోతే వీడియోలు యూట్యూబ్‌లో పెడతానంటూ హెచ్చరించాడు. భయపడిన మరియమ్మ.. ఆ బాలికకు పెళ్లి చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా సంబంధాలు చూడటం ప్రారంభించింది.
ఈ విషయం తెలిసుకున్న సైదా.. మరియమ్మను శనివారం గన్నవరం ఎయిర్‌పోర్టు వద్దకు తీసుకువెళ్లాడు. అటుగా కారు వస్తుండటం చూసి ఒక్కసారిగా ఆమెను రోడ్డు మీదకు నెట్టాడు. కారు ఢీకొనడంతో మరియమ్మకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు సైదాకు దేహశుద్ధి చేసి ఆమెను అక్కడ్నుంచి పంపించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సైదా బెదిరింపులకు పాల్పడడంతో విసిగివేసారిన మరియమ్మ భర్తకు దేహశుద్ధి చేసి.. తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment