సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సోషల్‌మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసు దర్యాప్తును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. అడిషనల్ డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం.. బాధ్యుల్ని పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఫిర్యాదు సందర్భంగా షర్మిల కొన్ని యూట్యూబ్ లింకుల్ని సైతం పొందుపరిచారు. ఈ లింకుల ఆధారంగా లాగిన్, ఐపీ అడ్రస్ వివరాలు తెలుసుకునేందుకు సాంకేతికంగా ప్రయత్నిస్తున్న విచారణ బృందం సహకరించాలంటూ యూట్యూబ్‌కు లేఖ రాశారు.
యూట్యూబ్ నుంచి లాగిన్, ఐపీ వివరాలు వచ్చిన తర్వాత ఏ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఇంటర్‌నెట్ సేవలు అందుకున్నారో తెలుసుకోవడం సులభం అవుతుంది. ఆ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించడం ద్వారా నిందితులకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తారు. నిందితుల్ని గుర్తించాలంటే ప్రాథమికంగా ఆయా అంశాలను యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసిన వారి వివరాలు తెలియాలి. సాధారణంగా ఏ సబ్‌స్క్రయిబర్ అయినా వీడియో అప్‌లోడ్ చేయడానికి కచ్చితంగా లాగిన్ కావాల్సిందే. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ నంబరుతోపాటు పలు వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు వారు యూట్యూబ్‌ను వినియోగించే సమయంలో ఏదో ఒక ఐపీ (ఇంటర్‌నెట్ ప్రొటొకాల్) అడ్రస్ ఆధారంగా ఇంటర్‌నెట్‌తో అనుసంధానమవుతారు.
ఫీల్డ్ ఆపరేషన్‌కు వేరే బృందం
సాంకేతిక దర్యాప్తు పూర్తయిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి ఫీల్డ్ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం మరో ప్రత్యేక బృందం సిద్ధంగా ఉంది. షర్మిలపై 2014 ఎన్నికల సందర్భంలోనూ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేశారు. అప్పట్లో ఆమె ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ ఠాణాలోనే కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. అప్పట్లో ఆ కేసును సోషల్ మీడియా వేదికగా పరువునష్టం సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదుచేశారు. కొన్నాళ్లకు ఈ సెక్షన్‌ను సుప్రీం కోర్టు తొలగించడంతో ఆ కేసు మూతపడింది. అయితే తాజా ఫిర్యాదును.. అభ్యంతరకర, అసభ్య వ్యాఖ్యలకు సంబంధించిన సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. దీంతో విచారణ పూర్తయ్యేంత వరకు కేసు మూసివేసే ప్రసక్తే లేదని పోలీసులు చెప్తున్నారు.
అప్పట్లో అరెస్టు అయిన ముగ్గురు నిందితులను సైతం ప్రస్తుత కేసులో అనుమానిత జాబితాలో చేర్చారు. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ వ్యవహారంతో సంబంధం ఉందా? అనే వివరాలను సాంకేతికంగా, క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. సైబర్ క్రైమ్ విభాగం అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘షర్మిల ఫిర్యాదు మేరకు నమోదైన కేసు దర్యాప్తునకు కీలక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక బృందం పనిచేస్తోంది. యూట్యూబ్‌తో పాటు ఫేస్‌బుక్‌లోనూ అభ్యంతరకర, అసభ్య సందేశాలు పోస్ట్ చేశారు. నిందితుల్ని పట్టుకున్న తర్వాత ఈ వ్యవహారం వెనుక ఉన్న వారి వివరాలు ఆరా తీస్తాం. బాధ్యులు ఎవరైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
లాగిన్, ఐపీ వివరాలివ్వండి!
Published Thu, Jan 17 2019 2:03 AM | Last Updated on Thu, Jan 17 2019 2:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment