సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కుమార్తె, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. సోమవారం ఆమె ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన విషయం విదితమే. దీనికి కీలక ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు బాధ్యుల్ని పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. యూట్యూబ్‌లో దాదాపు 60 వీడియో లింకుల్ని గుర్తించిన పోలీసులు అవి ఏయే యూట్యూబ్ చానల్స్‌కు సంబంధించినవో గుర్తించే పనిలో ఉన్నారు.
ఆయా చానల్స్‌లో ఉండే వివరాల ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. శుక్రవారం నాటికి మొత్తం 15 మందిని గుర్తించారు. వీరిలో ఐదుగురిని పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఠాణాకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం వీరిని నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. వీరంతా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారే.
ఐదుగురూ సొంతంగా యూట్యూబ్ చానల్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. శని, ఆదివారాల్లో మరికొందరిని విచారించాలని నిర్ణయించారు. అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ, యూ–ట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసే వారి వివరాలు తెలియాల్సి ఉంది. వారు యూ–ట్యూబ్‌ను వినియోగించే సమయంలో ఏ ఐపీ (ఇంటర్‌నెట్ ప్రొటోకాల్) అడ్రస్ ఆధారంగా ఇంటర్‌నెట్‌ను యాక్సిస్ చేశారో గుర్తించాలి. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్ యాజమాన్యానికి లేఖ రాశారు. ఆయా చానల్స్‌లో ఉన్న 60 వీడియోలకు దిగువన అనేక మంది అభ్యం తరకరంగా కామెంట్స్ చేశారు. వీడియో పోస్ట్ చేసిన వారితోపాటు ఈ కామెంట్స్ చేసిన వ్యక్తులు కూడా నిందితులుగా మారుతారని చెప్తున్నారు.
యూట్యూబ్‌లోని ఆ వీడియోల కింద వీరు క్రియేట్ చేసుకున్న పేరు మినహా మిగిలిన వివరాలు ఉండవు. ఇవన్నీ యూట్యూబ్ నిర్వాహకులకే తెలుస్తాయి. కామెంట్ చేసిన వారి ఐడీలను గుర్తిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారి లాగిన్, ఐపీ వివరాలు ఇవ్వాల్సిందిగా యూట్యూబ్‌కు లేఖలు రాస్తున్నారు. ఇలా సాంకేతిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు నిందితుల్ని గుర్తించడానికి ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు.
ఐదుగురికి నోటీసులు జారీ
Published Sat, Jan 19 2019 1:49 AM | Last Updated on Sat, Jan 19 2019 4:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment