
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుల ఇళ్లు, సంస్థలపై నాలుగో రోజైన ఆదివారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. విజయవాడలోని శ్రీనివాస్ ఇంటితోపాటు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ఇళ్లల్లో నిరంతరాయంగా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా హవాలా రూపంలో నగదు పంపిణీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఆదాయ పన్ను అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న ఒక ప్రధాన నిర్మాణ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టుల రూపంలో దక్కించుకున్న పనులను చేయకపోయినా దొంగ ఇన్వాయిస్‌ల రూపంలో నగదును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి హవాలా, మనీల్యాండరింగ్ రూపంలో తరలించినట్లు తెలుస్తోంది. ఇలా బ్యాంకుల నుంచి డ్రా చేసిన మొత్తం ఎప్పుడు, ఎక్కడకు చేర్చారనే విషయాన్ని బ్యాంక్ స్టేట్‌మెంట్ల ఆధారంగా అడుగుతూ వివరాలు నమోదు చేసుకుంటున్నారని, దీనివల్ల విచారణ ఆలస్యం అవుతోందని సంబంధింత వర్గాల సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికార బృందాలు విడతల వారీగా విచారిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి వీరి ఇళ్లు, కార్యాలయాల్లోకి బయటి వ్యక్తులను, బంధువులను కూడా రానివ్వకుండా విచారణ చేస్తున్నారు. అలాగే ఉత్తర తెలంగాణకు చెందిన మరో రాజకీయ నాయకుడి ఇంటిపైనా ఐటీ దాడులు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment