
సాక్షి, ముంబయి : దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు మరోసారి తేటతెల్లమైంది. స్వయంగా పీటర్ ముఖర్జియానే షీనా హత్యకు ప్లాన్ చేయించారా అనే కోణంలో కూడా కేసు మలుపు తిరగనుంది. ఎందుకంటే ఆ రోజు హత్య చేసిన తర్వాత షీనాను పూడ్చి పెట్టిన ప్రాంతం నుంచి పీటర్‌కు ఇంద్రాణి ఫోన్ చేసినట్లు ఆమె డ్రైవర్ ఈ కేసులో అప్రూవర్ అయిన శ్యామ్‌వర్ రాయ్ చెప్పాడు. దీంతో పీటర్‌కు తెలిసే ఈ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. 2012 ఏప్రిల్ 23న షీనా బోరా హత్య జరిగిన విషయం తెలిసిందే.
ఇంద్రాణి తన మాజీ భర్త, డ్రైవర్ శ్యామ్‌వర్‌రాయ్‌తో కలిసి కన్న కూతురునే కడతేర్చింది. ఈ హత్య ఘటన దేశంలో సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన సాక్షి శ్యామ్‌వర్ రాయ్ అప్రూవర్‌గా మారి ప్రస్తుతం సీబీఐకు సహకరిస్తున్నాడు. అయితే, పీటర్ తరపు న్యాయవాది ప్రస్తుతం శ్యామ్‌వర్ రాయ్ వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ఆయనకు శ్యామ్ ఈ విషయాలు వెల్లడించాడు. ఆ రోజు ఇంద్రాణి రెండుసార్లు పీటర్‌కు ఫోన్ చేశారని, హత్య చేసిన తర్వాత పూడ్చిపెట్టేందుకు వెళ్లే సమయంలో ఓసారి, పూడ్చిపెట్టిన తర్వాత మరోసారి రెండుసార్లు ఫోన్ చేసినట్లు తెలిపాడు. తనకు కూడా పనిబాగా పూర్తి చేశావంటూ కితాబిచ్చారని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment