స్వామీజీ భౌతికకాయం, ఉడుపి పుష్కరిణిలో లక్ష్మీవరతీర్థ (ఫైల్)
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ప్రముఖ మఠాల్లో ఒకటైన ఉడుపి జిల్లా శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థస్వామీజీ (55) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనది సహజ మరణమా, లేక కుట్ర దాగి ఉందా? అనే అనుమానాలు ముసురుకున్నాయి. సోమవారం మూలమఠంలో జరిగిన వన మహోత్సవంలో భోజనం చేశారు. అనంతరం ఆయన తీవ్ర అస్వస్థత పాలయ్యారు. దీంతో మణిపాల్ కేఎంసీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే ఆయన శరీరంలో విషపు ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు ప్రకటించటంతో అనుమానాలు మొదలయ్యాయి. లక్ష్మీవర తీర్థస్వామీజీ ఆకస్మిక మృతి బాధాకరమని ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. మృతి వెనుక ఎలాంటి అనుమానాలు ఉన్నట్లు తేలినా సీబీఐతో విచారణ చేయిస్తామని తెలిపారు.
బాల్యంలోనే సన్యాస దీక్ష
స్వామీజీ అసలు పేరు హరీశ్ ఆచార్య. కుందాపుర తాలూకా మడామక్కిలో విఠల ఆచార్య, కుసుమమ్మ దంపతులకు 1964 జూన్ 8న జన్మించారు. 1971 జూలై 2న తన ఎనిమిదో ఏట సన్యాసం పుచ్చుకున్నారు. అనంతరం ఉడుపి జిల్లాలోని అష్టమఠాల్లో ఒకటైన శిరూరు మఠం చేరుకున్నారు. ఇప్పటివరకు మఠాధిపతిగా మూడుసార్లు బాధ్యతలు తీసుకున్నారు. స్వామీజీలకున్యాయపర అధికారాలు కావాలని పలుసార్లు డిమాం డ్ చేసి వార్తలకెక్కారు. స్వామీజీ సంగీతం, కరాటె అంటే బాగా ఇష్టపడేవారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించారని వార్తలు వచ్చాయి.
జనసంద్రం మధ్య అంత్యక్రియలు
ఆస్పత్రి నుంచి స్వామీజీ పార్థివ దేహాన్ని శిరూరు వద్ద ఉన్న కృష్ణమఠానికి తరలించారు. అనంతరం భారీ జనసందోహం మధ్య ఉడుపిలోని కృష్ణమఠం నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న మూలమఠానికి పూలతో అలంకరించిన వాహనంలో తరలించారు. దారి పొడవునా అభిమానులు, భక్తులు బారులు తీరారు. కాగా ఉడుపి జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ పర్యవేక్షించారు. మూలమఠం వద్ద పది నిమిషాల పాటు ఉంచి భక్తులకు దర్శన అవకాశమిచ్చారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు.
సమాజానికి ఎంతో లోటు: శివకుమార్ స్వామీజీ, సిద్ధగంగా మఠాధిపతి
శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థస్వామీజీ ఆకస్మిక మరణంతో సమాజం చాలా నష్టపోయింది. స్వామీజీ చాలా దూరదృష్టితో ఉండేవారు. శిరూరు మఠంలో సాంస్కృతిక, ధార్మిక తదితర వాటిలో శిక్షణ ఇచ్చేవా రు. తాము ఎల్లప్పుడూ ఆయన ఆశీస్సులు పొందేవాళ్లం.
ప్రముఖుల సంతాపం...
కాగా, లక్ష్మీవర తీర్థస్వామీజీ హఠాన్మరణంపై పలువురు ప్రముఖులు స్పందించారు. లక్ష్మీవర తీర్థస్వామీజీ మాకు మార్గదర్శకుడిగా ఉండేవారు. ఆయన ఆకస్మిక మృతికి చింతిస్తున్నా. సమాజంలోని భక్తులు, ప్రజలు చాలా నష్టపోయారు. నిత్యం ఆయన సేవలు పొందే భాగ్యం కోల్పోయారు. అని మాజీ ప్రధాని దేవగౌడ తెలిపారు. ‘శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థస్వామీజీ మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. స్వామీజీ బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్ని శాస్త్రాల్లో విజ్ఞానం సంపాదించారు. అలాంటి వ్యక్తి అకాలంగా మరణించడం బాధాకరం’ అని మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment