
విచారణ జరుపుతున్న అధికారులు
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధి పడమటితండాలో ఏఎమ్మార్పీ లింక్ కెనాల్‌లో ట్రాక్టర్ బోల్తా పడిన ఘట నలో తొమ్మిది మంది మృతిచెందిన కేసుపై ఆదివారం అధికారులు విచారణ జరిపారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖ అధికారులు, పడమటితండావాసుల సమక్షంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన ప్రాంతాన్ని నిర్ధారించేందుకు, ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలో మిషన్ భగీరథ గుంత ఉండడంతో ప్రమాదానికి గుంత కారణమా కాదా అనే కోణంలో కొలతలు తీసుకున్నారు. పడమటితండావాసుల నుంచి వివరాలను సేకరించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. విచారణ జరిపిన వారిలో సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్ భగీరథ డీఈ శ్రీధర్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఏఈలు నగేశ్, వెంకటేశ్వర్లు, అజిత్, పలువురు తండావాసులు ఉన్నారు.