
ఈ చిత్రంలో కనిపిస్తున్న గొర్రెలు అనంతపురం త్రీటౌన్ పోలీసుస్టేషన్ ఆవరణలో బంధించినవి. గత నవంబర్ 17న బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లిలో గొర్రెల కాపరి వినోద్‌కు చెందిన మూడు గొర్రెలను దొంగిలించారు. వాటిని మరసటి రోజు గుత్తిరోడ్డులోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో విక్రయించారు. అనుమానం వచ్చిన గొర్రెల కాపరులు అదేరోజు సంతకు వచ్చి వారి గొర్రెలను కనుగొన్నారు. దీనిపై త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు గొర్రెల దొంగతనాలకు పాల్పడింది ఎవరనే అంశాన్ని పక్కన పెట్టి దొరికిన రెండు గొర్రెలకు రూ. 6 వేలు చెల్లించి తీసుకుపోవాలని వాటి యజమానులనే ఆదేశించారు. గొర్రెల దొంగల నుంచి కొనుగోలు చేసింది ఓ సీఐకు చెందిన వ్యక్తులు కావడంతో ఈ విధమైన పంచాయితీ చేశారు.
అనంతపురం సెంట్రల్: అంతర్‌రాష్ట్ర దొంగలకు అనంతపురం జిల్లా అడ్డాగా మారింది. అలా వచ్చి ఇలా దొంగతనాలు చేసుకొని వెళ్లిపోతున్నారు. సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం దొంగలకు కలిసొస్తోంది. ఇప్పటికే అనేక మంది అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు కటకటాల వెనక్కు పంపిస్తున్నప్పటికీ జిల్లాలోకి ముఠాలు చొరబడుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలో శుక్రవారం రాత్రి పశువుల దొంగలు చేసిన బీభత్సం పోలీసులకే ముచ్చెమటలు పట్టించింది.
గొర్రెలు, పశువుల దొంగతనాలు నిత్యకృత్యం
జిల్లాలో 50 శాతం మంది ప్రజలు గొర్రెల పెంపకం, పశు పోషణపై ఆధారపడుతున్నారు. గొర్రెలను ఎక్కువగా ఆరుబయల్లోనే పోషిస్తున్నారు. దీంతో దొంగలు వాహనం నిలబెట్టడం.. గొర్రెలను ఎత్తుకెళ్లడం సులువవుతోంది. పశువుల దొంగతనాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు కదిరిలో కూడా ఈ తరహా దొంగతనాలు జరిగాయి. ఇవన్నీ ఫిర్యాదుల వరకే పరిమితమవుతున్నాయి. పశువులు, గొర్రెల దొంగతనాలు పాల్పడుతున్నది ఎక్కువగా కర్ణాటకకు చెందినవారిగానే అనుమానిస్తున్నారు. పశువులను ఎక్కువగా తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పశువుల అపహరణతోపాటు ఇళ్లల్లో చోరీలకు కూడా అంతర్‌రాష్ట్ర దొంగలు పాల్పడుతున్నారు. ముఖ్యం గా బిహార్ ముఠా అంటే పోలీసులే భయబడాల్సి వస్తోంది. వారు ఎంత కైనా తెగిస్తారనే భయం నెలకొంది.
నిఘా.. నిద్రావస్థ!
నేరాల నివారణ కోసం అనంతపురంలోని ప్రధాన కూడళ్లలో దాదాపు 300 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నేరం జరిగిపోయిన తర్వాత ఎలా జరిగిందని తెలుసుకోవడానికి మాత్రమే ఈ కెమెరాలు పనికి వస్తున్నాయి. శుక్రవారం రాత్రి పశువుల దొంగలు చొరబడ్డారని స్థానికులు తెలిపేంత వరకు పోలీసులు రంగంలోకి దిగలేదు. దొంగలను గుర్తించినా పట్టుకోలేకపోయారు. నగరం నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఉండి.. అప్రమత్తమై ఉంటే పశువుల దొంగలను పట్టుకునే అవకాశం ఉండేది. అర్ధరాత్రి పూట విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రత్యేక బృందాలు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
♦ డిసెంబర్ 28న కోవూరునగర్‌లో భాగ్యలక్ష్మి అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ జరిగింది. బుక్కరాయసముద్రం మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న లావణ్య, శివకుమార్ దంపతులు ఇంట్లో లేని విషయాన్ని గమనించిన దొంగలు తాళాలు పగులకొట్టి బీరువాలో ఉన్న సుమారు 41 తులాల బంగారం, రూ.88 వేల నగదు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీల ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నిందితులు బిహార్ ముఠాగా నిర్దారించారు. ముఠాను పట్టుకువచ్చేందుకు ప్రత్యేక బృందం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా ఉత్తచేతులతో వెనుతిరిగి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment