కొలంబో(శ్రీలంక): నేటి సమాజంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటనలో ఏడుగురికి శ్రీలంక హైకోర్టు మరణ శిక్ష విధించింది. 2015లో తమిళులు అధికంగా ఉండే జాఫ్నా ప్రావిన్స్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. పున్‌కుడివితు ప్రాంతానికి చెందిన శివలోగనాథన్(18) అనే యువతి 2015 మే 13వ తేదీన స్కూల్‌కు వెళ్లి కనిపించకుండా పోయింది.
మరుసటి రోజు కాళ్లు, చేతులు, కట్టేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులు చూసి దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జాఫ్నా హైకోర్టు ఏడుగురిని దోషులుగా తేల్చి వారికి మరణశిక్ష విధించింది. ఇందులో ప్రధాన నిందితుడు స్విస్ కుమార్ బాలికపై గ్యాంగ్‌రేప్‌తో పాటు హత్యను వీడియో తీశారు. ఈ హత్యాచారానికి సంబంధించి నిందితులపై పోలీసులు 41 అభియోగాలు మోపారు.
విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నిందితులు ఏడుగురికి 30 ఏళ్ల కఠిన కారాగారంతోపాటు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాక పది లక్షల డాలర్ల జరిమానా విధించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, నిందితుల్లో ఒకరు జైలు నుంచి తప్పించుకోవటానికి కారకుడయ్యారని సీనియర్ పోలీస్ అధికారి లలిత్ జయసింగేను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సర్వీసులో ఉండగా అరెస్టైన ఉన్నత స్థాయి పోలీసు అధికారి ఈయనే కావటం గమన్హారం.