ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఓ ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా విద్యార్ధినిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్ దేహాట్ జిల్లాకు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శైలేంద్ర రాజ్‌పుత్ గత కొద్ది కాలంగా బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో యాజమాన్యం శైలేంద్రను మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అవమానంపై బదుల తీర్చుకోవాలని భావించిన అతడు... బాలిక గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు బాలికపై మూడు సార్లు కాల్పులు జరిపాడని.. అందులో ఓ బుల్లెట్ మెడకి తగలడంతో తను కుప్పకూలిపోయిందని తెలిపారు. గాయపడిన ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారని, వైద్యులు చికిత్స చేస్తుండగా ఆమె మరణించిందని వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యలు పాఠశాలపై దాడి చేసి.. రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment