నెల్లూరు(క్రైమ్), కావలి : పట్టణంలో నంబర్లాట జూదం జోరుగా సాగుతోంది. మానస సెంటర్, జెండా చెట్టు సెంటర్, దేవి థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ సెంటర్, ఒంగోలు బస్టాండ్ సెంటర్, వాయునందన ప్రెస్ వీధి, రామ్మూర్తిపేట, పాతూరు, కచ్చేరిమిట్ట, తుఫాన్‌నగర్, ఇందిరా నగర్, వెంగళరావునగర్, వైకుంఠపురం, తదితర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని జూదరులు నంబర్లాట నిర్వహిస్తున్నారు. గతంలో పబ్లిక్‌గా నిర్వహించే జూదరులు పోలీసుల దాడులతో ప్రస్తుతం చాటుమాటుగా కొనసాగిస్తున్నారు. ఈ జూదంలో ఆరితేరిన బుకీలు పట్టణంలో వంద మందికి పైగా ఉన్నట్లు సమాచారం. సాధారణ వ్యక్తుల నుంచి వివిధ వృత్తుల్లో గుర్తింపు ఉన్నవారు సైతనం నంబర్లు రాసుకుని బుకీలుగా వ్యవహరిస్తున్నారు. జూదం నిర్వహించే బుకీల్లో కొందరు ఆర్థికంగా నిలదొక్కుకోగా, మరి కొందరు ఆర్థికంగా చితికిపోయారు. బెట్టింగ్‌లు కట్టే వారు సైతం ఆర్థికంగా దెబ్బతిని రోడ్డున పడుతున్నారు.
అంతా మోసమే
నంబర్లాట, మట్కా, బ్రాకెట్ నంబర్లు, కళ్యాణి, తదితర పేర్లతో నిర్వహించే నంబర్ల గేమింగ్ జూదం ముంబాయి కేంద్రంగా సాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక నంబర్‌పై అంటే 0 నుంచి 9 వరకు బెట్టింగ్ కాస్తారు. 12 గంటల తర్వాత గెలిచిన నంబర్‌ను ప్రకటిస్తారు. దీనిని ఓపెనింగ్ నంబర్ అంటారు. గెలిచిన నంబర్‌పై నగదు పెట్టిన వారికి రూ.100కు రూ.400 ఇస్తారు. మళ్లీ సాయంత్రం 6 గంటల వరకు రెండు నంబర్ల(01 నుంచి 99 వరకు)పై బెట్టింగ్ పెడతారు. దీనిని క్లోజింగ్ అంటారు. రెండు నంబర్లపై బెట్టింగ్ పెట్టి విజేతగా నిలిచి వారికి రూ.100కు రూ.8వేలు ఇస్తారు. పెద్ద ఎత్తున సాగే ఈ జూదానికి స్థానికులు కొందరు బుకీలుగా వ్యవహరిస్తారు. వాస్తవానికి వారే నిర్వాహకులైన కమీషన్ ఏజెంట్లుగా నమ్మిస్తుంటారు. బెట్టింగ్ కట్టిన నంబర్ రాకపోతే నగదును జేబుల్లో వేసుకొంటారు. నంబర్ గెలిస్తే నగదును చెల్లిస్తుంటారు. నంబర్ గెలవడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతోంది.
గెస్సింగ్ నంబర్ చార్ట్
ఏ రోజు ఏ పూట ఏ నంబర్ విజేతగా వస్తోందో తెలియజేసే గెస్సింగ్ నంబర్ చార్టు అంటూ మరో రకం మోసం కూడా ఈ జూదంలో ఉండటం గమనార్హం. గెస్సింగ్ నంబర్లతో ఉండే చార్ట్‌ను జూదం వ్యసనపరులు తాళపత్ర గ్రంథంలా భావిస్తుంటారు. ఈ చార్ట్‌లను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొంటారు. ఈ జూదంలో బాగా తలపండిన వారు తామే స్వతహాగా చార్ట్‌ను తయారు చేసుకొంటారు. ఏడాది, నెల, వారం, తేదీ, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని, ఆ రోజు మొదటి నంబర్ విజేత ఏది, రెండు నంబర్ల విజేత ఏది అన్ని గెస్సింగ్ చేస్తుంటారు. గెస్సింగ్ నంబర్లు చెప్పే నిష్ణాతులుగా పట్టణంలో కొందరికి గుర్తింపు కూడా ఉండటం గమనార్హం. నంబర్లాట జూదం ఆడి డబ్బును పోగొట్టుకుని కటుంబాలను నాశనం చేసుకున్న వారు పట్టణంలో వేలాది మంది ఉన్నారు. నిర్వాహకుల్లో కొందరు ఆర్థికంగా స్థితిమంతులు కాగా, మరి కొందరు ఆస్తులను పోగొట్టుకొని కూలీలుగా మారారు. పట్టణానికి చెందిన ఓ యువకుడు జూదం నిర్వహిస్తూ బాగా సంపాదించాడు. ఒకసారి ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో డబుల్ నంబర్‌పై బెట్టింగ్ కాయగా ఆ నంబర్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో లక్షలాది రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఆస్తులను పోగొట్టుకుని దినసరి కూలీగా మారాడు.
అరెస్ట్‌లకు రంగం సిద్ధం
పట్టణంలో నంబర్ల జూదానికి పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా బుధవారం ఒకటో పట్టణ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రెండో పట్టణ పోలీసులు జూదరులపై దృష్టి సారించారు. జూదం ఆడుతుంటే సమాచారం అందుకుని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన తమపై బుకీలు తిరగబడ్డారని, కొట్టారని, పారిపోవడానికి ప్రయత్నించి తోసేశారని కేసులు నమోదు చేస్తున్నారు. రౌడీషీట్‌లు సైతం ఓపెన్ చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
నంబర్లాట..బెట్టింగ్ కోట
Published Fri, Sep 29 2017 10:58 AM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM
Advertisement