యూపీలోని వారణాసి లోక్‌సభ ఎన్నికల పోరులో మరోసారి బరిలోకి దిగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. ఆయన ఈ స్థానం నుంచి నేడు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత ఎన్నికల విజయాల కంటే ఈసారి మోదీ భారీ విజయాన్ని నమోదు చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వారణాసిలో ఏ వర్గంవారు అధిక సంఖ్యలో ఉన్నారు? ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ఏ అంశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది?
దేశ ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన వారణాసి లోక్‌సభ స్థానం ఐదు అసెంబ్లీ స్థానాల కలయిక. అవి వారణాసి సౌత్ సిటీ, వారణాసి నార్త్, వారణాసి కాంట్, రోహనియా, సేవాపురి. 1957 నుంచి ఈ సీటును బీజేపీ ఏడుసార్లు, కాంగ్రెస్ ఆరుసార్లు దక్కించుకున్నాయి. 1991 నుంచి 2003 మధ్యకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ సీటు బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతికి చిక్కింది. 2009 నుంచి ఈ సీటును బీజేపీ అభ్యర్థులు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. దీంతో వారణాసి బీజేపీకి కంచుకోటగా మారింది.
వారణాసి నియోజక వర్గంలో మొత్తం 19.62 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10 లక్షల 65 వేల 485 మంది పురుషులు, 8 లక్షల 97 వేల 328 మంది మహిళలు. వారణాసిలో 135 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 52 వేల 174 మంది ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
వారణాసి లోక్‌సభ స్థానంలో మొత్తం జనాభాలో 75 శాతం మంది హిందువులు, 20 శాతం ముస్లింలు. మిగిలిన ఐదు శాతం జనాభాలో ఇతర మతాలకు చెందిన వారున్నారు. ఈ నియోజకవర్గంలో 65 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో, 35 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 10.01 శాతం గిరిజనులు , 0.7 శాతం దళిత తరగతికి చెందినవారున్నారు.
ఈ నియోజక వర్గంలో గరిష్టంగా రెండు లక్షల మంది ఓటర్లు కుర్మీ సామాజికవర్గానికి చెందినవారున్నారు. వీరు రోహనియా, సేవాపురి ప్రాంతాలలో ఉన్నారు. ఈ స్థానంలో రెండు లక్షల మంది వైశ్య ఓటర్లు కూడా ఉన్నారు. వారు ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నారు. కుర్మీ, వైశ్య వర్గం తర్వాత బ్రాహ్మణ, భూమిహార్ ఓటర్లు కూడా వారణాసిలో అత్యధికులు ఉన్నారు. ఈ సీటుపై ఎన్నికల విజయ పతాకాన్ని ఎగురవేసే శక్తి యాదవ, ముస్లిం వర్గాల ఓట్లకు కూడా ఉంది. ఈ స్థానంలో యాదవ సామాజికవర్గానికి లక్ష ఓట్లు ఉన్నాయి. యాదవ ఓటర్లు కాకుండా ఈ స్థానంలో మొత్తం మూడు లక్షల మంది ఓటర్లు ఓబీసీ వర్గానికి చెందినవారున్నారు.
Comments
Please login to add a commentAdd a comment