
సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనమలూరు మండలం వణుకూరులో కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. వణకూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. సామిల్ (కట్టె మిషన్)లో పనిచేసే అతన్ని గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకొని.. కొంతదూరం వరకు తీసుకెళ్లి దాడి చేశారు. కారులో తిప్పుతూ దాడి చేసిన అనంతరం అతన్ని రోడ్డుపై వదిలేసి పారిపోయారు. ఈ మేరకు బాధితుడు పెనమలూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆర్ధిక వ్యవహారాల కారణంగానే బాధితుడిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.