
రీటా
ఓ మొగుడు కట్నాసురుడి అవతారమెత్తాడు. పెళ్లి సమయంలో ఇస్తామన్న వరకట్నం ఇవ్వలేదని భార్యను హింసించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా కట్నం డబ్బులు వసూలు చేయాలనుకున్న అతగాడు.. భార్యకు తెలియకుండా ఆమె కిడ్నీని అమ్మేశాడు. అదీ పెళ్లై 12 ఏళ్లు గడిచిన తర్వాత. కోల్‌కతాకు చెందిన బిశ్వజిత్‌కు 2005లో రీటాతో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో వరకట్నం కింద 2 లక్షలు ఇచ్చేందుకు రీటా తల్లిదండ్రులు అంగీకరించారు. కానీ అనుకోని కారణాల వల్ల డబ్బు ఇవ్వలేకపోయారు. కట్నం ఇవ్వాల్సిందేనని బిశ్వజిత్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. కానీ తన కుటుంబ పరిస్థితిని తలుచుకొని రీటా మౌనం వహించింది. రెండేళ్ల కిందట రీటాకు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు బిశ్వజిత్.
అపెండిక్స్ అని చెప్పి ఆపరేషన్ కూడా చేయించాడు. అదే నిజమనుకొని అప్పట్లో అందరూ నమ్మారు. ఇటీవల రీటాకి మళ్లీ కడుపులో నొప్పి రావడంతో బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్కాన్ చేసిన డాక్టర్లు కుడివైపు కిడ్నీ లేదని చెప్పారు. దీంతో ఖంగుతిన్న రీటా.. భర్తను నిలదీసింది. రెండేళ్ల క్రితం చేసిన ఆపరేషన్‌లో.. కిడ్నీని అమ్మేసినట్లు చెప్పాడు. అదీగాక కట్నం కింద ఆ డబ్బును లెక్కేసుకో అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. దీంతో బంధువులతో కలసి రీటా పోలీసు కేసు పెట్టింది. బిశ్వజిత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సర్జరీ చేసిన ఆస్పత్రిపై దాడులు చేశారు. దాని వెనుక అవయవాల స్మగ్లింగ్ గ్యాంగ్ హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.