సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : గుంటూరు జిల్లా, నరసరావుపేటలో స్టేడియం కమిటీ అభివృద్ధి పేరుతో లక్షలాది రూపాయలు గోల్‌మాల్ చేసిన శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అనుంగు శిష్యుడు, స్టేడియం కమిటీ మాజీ ఇన్‌చార్జి మందాడి రవి సోమవారం కోర్టులో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియం కమిటీ చైర్మన్‌గా వాస్తవానికి ఆర్డీవో వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ, కోడెల అండదండలతో మందాడి రవి అన్నీ తానై అక్రమ వ్యవహారాలను చక్కబెట్టాడు. స్టేడియంలో ఏ కార్యక్రమం చేపట్టినా అనధికారికంగా కే–ట్యాక్స్ వసూలు చేసేవాడు.
గడచిన ఐదేళ్లలో స్టేడియం అభివృద్ధి ముసుగులో లక్షలాది రూపాయలను కోడెల కుమారుడు శివరామ్ కమిటీ ఇన్‌చార్జి రవిని అడ్డం పెట్టుకుని దండుకున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వం మారగానే అప్రమత్తమైన నిందితులు ఎక్కడా ఏ ఆధారం దొరకకుండా సాక్ష్యాలను తారుమారు చేశారు. రాత్రికి రాత్రే తాళాలు పగులగొట్టి రికార్డులను అపహరించుకు పోయారు. దీంతో స్టేడియంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని స్పోర్ట్స్ అథారిటీ అధికారులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
రూ.22 లక్షల దుర్వినియోగం..
స్టేడియంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు గత నాలుగేళ్లలో రూ.22 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో పాటు స్టేడియంలో ఉండాల్సిన విలువైన పైపులు, ఇతర సామగ్రి మందాడి రవి అపహరించుకెళ్లి అమ్ముకున్నట్లు తేలింది. ఈ మేరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ కొల్లా రాజేంద్రరెడ్డి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చీటింగ్, చోరీ కేసులు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న రవి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే న్యాయస్థానంలో చుక్కెదురు కావడంతో కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం. నిందితుడిని నరసరావుపేట సబ్‌జైలుకు తరలించారు.
నేడు సీఎం జగన్‌కు మద్దతుగా మాదిగల ర్యాలీ
నెహ్రూనగర్(గుంటూరు): మాదిగల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా గుంటూరులోని నగరంపాలెం నుంచి అసెంబ్లీ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించనున్నట్లు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ తెలిపారు. నగరంపాలెంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అసెంబ్లీ వరకు చేపట్టిన పాదయాత్రకు వ్యతిరేకంగా ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో నోటాకి ఓటు వేయమని చెప్పిన కృష్ణమాదిగకు.. వైఎస్ జగన్‌ను ప్రశ్నించే హక్కులేదన్నారు.
సమావేశంలో మాదిగ మహాసేన నాయకులు ప్రభాకర్, సుబ్బారావు, గోపి, బుజ్జి, రమేష్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మాదిగల అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేసూ మంగళవారం మంగళగిరి నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నమాదిగ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment