
కనిగిరి ఎక్సైజ్ కార్యాలయం లాకప్ గది
కనిగిరి: కల్తీ మద్యం (బ్రాండ్ మిక్సింగ్) మాఫియాలో ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సుమారు 20 మంది పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నకిలీ మూతల రవాణా, బ్రాండ్ మిక్సింగ్, రెస్టారెంట్, ప్రభుత్వ లైసెన్సీ షాపుల్లో అక్రమాలకు పాల్పడిన సుమా రు 15 మందిని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వీరిలో తొమ్మిది మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ఇద్దరు, ముగ్గురుని గుర్తించగా మరి కొందరి పాత్ర వెలుగు చూసే అవకాశం ఉంది.
మరో ఐదుగురికి కోసం వేట
కల్తీ మూతల రవాణాలో కీలక పాత్రధారుడు పి. శ్రీనివాసులను విచారణ అనంతరం మొత్తం 15 మందిని బ్రాండ్ మిక్సింగ్ (ఎక్కువ రేటు మద్యంలో తక్కువ రేటు మద్యం మిక్సింగ్) చేసినట్లు తేల్చారు. మరి కొందరి పాత్ర ఉండగా అందులో కీలకంగా ఉన్న అనంతపురానికి చెందిన ముగ్గురు దొరికితే కల్తీ గుట్టులో అసలు పాత్రధారులు దొరుకుతారు. అందులో కనిగిరికి చెందిన లిక్కర్ వ్యాపారులు నలుగురు, పామూరులో ముగ్గురు, సీఎస్‌పురంలో ముగ్గురు, దుత్తలూరులో ఒకరు, నందిపాడులో ఒకరుండగా అనంతపురంలో కీలక పాత్రధారులు ముగ్గురు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. పామూరు మండలం బొట్లగూడూరుకు చెందిన మాల్యాద్రి బతుకుదెరువుకు అనంతపురం వెళ్లి అక్కడా షోడాల అమ్మకాల వ్యాపారం చేస్తూ అనంతపురం లిక్కర్ మాఫీయాతో చేతులు కలిపి కనిగిరికి నకిలీ మాతల రవాణా రాకెట్ సాగించినట్లు విశ్వసనీయ సమాచారం. అనంతపురానికి చెందిన జనార్దన్, రమణతో పాటు మరో ఇద్దరి కోసం అనంతపురంలో టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మరంగా గాలిస్తున్నట్లు సమాచారం. అనంతపురం లిక్కర్ మాఫీయా దొరికితే అసలు తయారీ గుట్టురట్టయ్యే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని వేట సాగిస్తున్నారు.
భారీగా మాతల మార్పిడి
లిక్కర్ మూతల మార్పిడి మాఫియా మూడు, నాలుగు నెలల నుంచి తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు స్థానిక ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నా సుమారు ఏడాది నుంచి బ్రాండ్ మిక్సింగ్ మాఫియా దందా సాగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ టీం నివేదికలో ఉంది. అనంతపురానికి చెందిన జనార్దన్, రమణాలు పట్టుబడితే ఎంతకాలంగా మాఫియా రాకెట్ సాగుతోందనేది గుట్టురట్టు కానుంది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో లిక్కర్ మాఫియా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా కనిగిరి ప్రాంతంలోనే ఎక్కువగా కల్తీ లిక్కర్ వ్యాపారం సాగిందనే కోణంలో ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment