చెన్నై : ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళ ఏనుగు దాడిలో మృతిచెందారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గణపతి మా నగర్‌కు చెందిన పి. భువనేశ్వరి తన భర్త ప్రశాంత్ వీకెండ్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆరుగురు స్నేహితులతో కలిసి భువనేశ్వరి దంపతులు రెండు కార్లలో పాలమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో పాలమలైకు చేరుకుని.. కార్లను రోడ్డు పక్కన నిలిపి.. నాలుగు కి,మీ దూరంలో ఉన్న పాలమలై అరంగనాథర్ దేవాలయం వరకు నడుస్తూ వెళ్లారు. వీరికి దారిలో ఏనుగు ఎదురుపడింది. దీంతో భయభ్రంతాలకు గురై అందరూ దూరంగా పరుగులు తీశారు.
ఈ క్రమంలో పొదల్లో దాక్కొవాలని భువనేశ్వరి ప్రయత్నించగా.. అది గమనించిన ఏనుగు ఆమెను తొండంతో విసిరి పారేసింది.దీంతో ఆమె అక్కడక్కడే మరణించారు.మిగతా వారు ఏనుగు దాడి నుంచి సురక్షింతంగా బయటపడి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని రక్షించి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూర్ మెడికల్ కళాశాలకు పంపారు. కాగా భువనేశ్వరికి 11 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై రేంజ్ అధికారి సురేష్ మాట్లాడుతూ.. ఆడవిలో ప్రవేశించడానికి సదరు బృందం ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అనుమతులు లేకుండా అడవుల్లో ట్రెక్కింగ్ చేసినందుకు వారిపై కేసు నమోదు చేస్తామని అన్నారు. పాలమలై రిజర్వ్ ప్రాంతమని ఇక్కడ జంతువుల దాడి జరుగుతుందని ఇప్పటికే చుట్టు పక్కలా ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశామని అధికారి తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment