మృతిచెందిన రమేష్, గాయత్రి
అన్నానగర్: విరుదాచలం సమీపంలో బుధవారం ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. విరుదాచలం సమీపం తొట్టికుప్పం గ్రామంలో విరుదాచలం – సేలం రైల్వే పట్టాలపై బుధవారం 35 ఏళ్ల వ్యక్తి, 25 ఏళ్ల మహిళ గాయాలతో మృతిచెందారు. పట్టాల పక్కన బైకు, విషం బాటిళ్లు, చెప్పులు ఉన్నాయి. వీటిని గమనించిన స్థానికులు విరుదాచలం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ చిన్నప్పన్, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతులు అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యన్ కుమారుడు రమేష్ (38), పెన్నడం పొన్నేరికి చెందిన తిరుమూర్తి భార్య గాయత్రి (25) అని తెలిసింది. కూలీ అయిన రమేష్‌కి లక్ష్మీ అనే భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గాయత్రికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది.
తిరుమూర్తి విదేశాల్లో పనిచేస్తున్నాడు. రమేష్, గాయత్రి విరుదాచలంలోని ఓ మిఠాయి దుకాణంలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం ఇరు కుటుంబీకులకు తెలిసి తీవ్రంగా మందలించారు. వారం కిందట రమేష్ గాయత్రి అదృశ్యమయ్యారు. అనంతరం బంధువులు వారి కోసం పలు చోట్ల వెతికినా ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో బుధవారం వీరిఇద్దరూ తొట్టి కుప్పం పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment