
లలిత, చికిత్స పొందుతున్న మధుబాబు
శ్రీకాకుళం సిటీ/హిరమండలం/ సరుబుజ్జిలి : ఆమె పేరు లలిత. ఇంటర్ పూర్తి చేసుకుంది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. అతడి పేరు కరణం మధుబాబు. పొక్లెయినర్ డ్రైవర్. వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. మధుకు పెళ్లయ్యాక(వేరే యువతితో) కూడా అది కొనసాగింది. ఇంతలో లలితకు వివాహం నిశ్చయమైంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమన్న ఆలోచన వారిని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించింది. క్షణికావేశంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. ఘటనలో లలిత మరణించగా.. మధుబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం సుభద్రాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన మధుబాబు(26)కు గత ఏడాది ఫిబ్రవరి 14న వివాహమైంది. ప్రస్తుతం అతడికి ఆరునెలల బాబు ఉన్నాడు. 13 ఏళ్లుగా అతను ప్రొక్లెయినర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గోత లలిత(19)కు మధుబాబుతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. లలితకు మే నెలాఖరున పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. వివాహ విషయాన్ని మధుబాబు దృష్టికి తీసుకువెళ్లింది. బతికితే నీతోనే అంటూ చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరూ కలసి చనిపోయేందుకు నిర్ణయించుకున్నారు. హిరమండలంలోని మేజర్ పంచాయతీ సులభాయమెట్టు తోట వద్దకు వెళ్లి పురుగు మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గుర్తించిన స్థానికులు హిరమండలం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే లలితమ్మ మృతి చెందగా మధుబాబు ప్రస్తుతం రిమ్స్‌లో వైద్యసేవలు పొందుతున్నాడు. లలితమ్మ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. అవుట్‌పోస్ట్ పోలీసులు మధుబాబు నుంచి వివరాలు సేకరించారు. హిరమండలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి ముందే పరిచయం
మధుబాబుకు తన పెళ్లికి ముందే లలితతో పరిచయం ఉంది. అయితే కుటుంబ ఇబ్బందుల వల్ల మధుబాబుకు వేరొక అమ్మాయితో పెళ్లయింది. పెళ్లయిన తర్వాత కూడా లలితతో ప్రేమాయణం కొనసాగింది. లలిత వెంకట సాయి ప్రైవేటు విద్యాసంస్థలో ఇంటర్ చదివింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఎంపీసీలో 901 మార్కులు సాధించింది.
మే నెలాఖరులో పెళ్లి
లలితకు పెళ్లి నిశ్చయమైంది. మే నెలలో పెళ్లి నిశ్చయమవడంతో ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మి పెళ్లి ఖర్చులకు కుటుంబ సభ్యులు వినియోగించారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న లలిత ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment