
భోపాల్ : మూకహత్యలు, జై శ్రీరాం నినాదాల పేరిట హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయంటూ దేశవ్యాప్తంగా ఆందోళన వెల్లువెత్తుతున్న వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకులపై మూకదాడి కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులను కిడ్నాపర్లుగా భావించిన నవలాసిన్హా గ్రామస్తులు వారి కారు ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. బేతుల్ జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలు... తమ గ్రామంలోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా దిగిందని నవలాసిన్హా గ్రామంలో వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో తమ గ్రామంలోకి వాహనాలు ప్రవేశించకుండా చెట్లు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడేశారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బేతుల్ జిల్లా నాయకులు ధర్మేంద్ర శుక్లా, ధర్ము సింగ్, లలిత్ బరాస్కర్ కారులో అక్కడికి చేరుకున్నారు. వీరిని కిడ్నాపర్లుగా పొరబడ్డ గ్రామస్తులు.. కారు నుంచి వారిని బయటికి లాగి దాడి చేశారు. అనంతరం కారును కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వీరిని బందిపోట్లుగా భావించిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలతో చర్చించి శాంతింపజేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు గ్రామస్తులపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment