భోపాల్: అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండు ఉన్న ఓ విషరహిత పామును మధ్యప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ1.25 కోట్లు విలువ చేసే అరుదైన జాతికి చెందిన రెండు తలల పామును మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌ఘర్‌లో అయిదుగురు సభ్యుల ముఠా అదివారం విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. అంతర్జాతీయిమార్కెట్లో భారీ ఎత్తున డిమాండ్ పలికే ఈ పాము పేరు ‘రెడ్ సాండ్ బో’. అయితే ఇది విషరహిత సర్పం. దీనిని నార్సింగ్‌ఘర్ బస్‌స్టాండ్ వద్ద విక్రయించేందుకు సెల్‌ఫోన్‌లో డీల్ మాట్లాడుతుండగా స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పామును స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఈ అరుదైన రెడ్ సాండ్ బో పామును ఉపయోగించి ఖరీదైన మెడిసిన్స్, కాస్మోటిక్స్ తయారు చేస్తారు. చేతబడిలో కూడా ఉపయోగించే అత్యంత అరుదైన ఈ పాముకు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ కూడా ఉంది. ఈ పాము ధర వందలూ, వేలూ కాదు...లక్షలు, కోట్లు పెడితే తప్ప దీనిని సొంతం చేసుకోలేరు. అలాగే దీనిని ఇంట్లో పెంచుకుంటే మంచి జరుగుతుందని కొంతమంది నమ్మకం. అంతటి ఖరీదు ఉన్న ఈ పామును నిందితులు షేహోర్ జిల్లాలోని అటవి ప్రాంతంలో పట్టుకుని రూ.1.25 కోట్లకు విక్రయించడానికి తీసుకువచ్చినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. దీంతో వారిపై అదనంగా వన్యప్రాణి రక్షణ చట్టం కింద మరో కేసును నమోదు చేసినట్లు పోలీసు అధికారి కైలాస్ భరద్వాజ్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment