
గురువే కీచకుడై..
తిరువనంతపురం : విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలకు మార్గదర్శనంగా నిలవాల్సిన మదర్సా టీచర్ మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. పన్నెండు మందికి పైగా విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక గురువును పోలీసులు అరెస్ట్ చేశారు. కొట్టాయం జిల్లా కొడునగలూర్‌లో స్ధానిక మొహల్లా కమిటీ ఫిర్యాదుపై మదర్సా టీచర్ యూసఫ్(63)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాను పాతికేళ్ల వయసు నుంచే బాలికలపై లైంగిక దాడులకు పాల్పడేవాడినని నిందితుడు యూసఫ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. తాను చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యానని, తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తి కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి ప్రతీకారం తీర్చుకున్నానని చెప్పాడని వెల్లడించారు. బాలికలకు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసే అవగాహన, చట్టపరమైన చర్యలు తెలియవనే ధీమాతో తాను ఈ పనులకు తెగబడ్డానని నిందితుడు పేర్కొనడం గమనార్హం.