నిందితుడు చంద్రశేఖర్ వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేష్‌భగవత్
నేరేడ్‌మెట్: నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతున్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న నకిలీ పోలీసును రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. ఉప్పల్ పరిధిలోని మేడిపల్లి(బుద్దానగర్)కు చెందిన చింతల చందు అలియాస్ చంద్రశేఖర్ మేడిపల్లిలో ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. గతంలో అతడి సోదరిని ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడు. అప్పటి నుంచి ప్రేమికులపై ద్వేషం పెంచుకున్నాడు. 2002లో ఓఆర్‌ఆర్ సమీపంలో ఓ ప్రేమ జంటను బెదిరించి వారి నుంచి రూ.2వేల నగదు దోచుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హయత్‌నగర్ పోలీసులు అదే రోజు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆ తర్వాత కొన్నాళ్లు తన స్వస్థలమైన మల్లాపూర్‌కు వెళ్లిన చంద్రశేఖర్ చేపల వ్యాపారం చేసి భారీగా నష్టపోయాడు. మళ్లీ నగరానికి వచ్చిన అతను సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఏకాంతం కోసం ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాలకు వచ్చే ప్రేమ జంటలను దోచుకునేందుకు పథకం పన్నాడు. వారి వద్దకు వెళ్లి పోలీసునని బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు లాక్కునేవాడు. బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్ సర్వీస్ రోడ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన చంద్రశేఖర్‌ను ఎల్‌బీనగర్ సీసీఎస్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ పోలీసు గుట్టురట్టయ్యింది. రెండేళ్లుగా అతను అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పోచంపల్లి, హయత్‌నగర్, ఘట్‌కేసర్, కీసర, శామీర్‌పేట్ ఠాణాల పరిధిలో సుమారు 30 దోపిడీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 9.5 తులాల బంగారం, రూ.3లక్షల నగదు, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో క్రైం డీసీపీ రాంచంద్రారెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఎల్‌బీనగర్ సీసీఎస్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment