నిందితుడు భాస్కర్
సాక్షి, సిటీబ్యూరో: నగ్నంగా ఉండి వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది యువతులు, మహిళలను వేధింపులకు గురి చేసిన జనగామ జిల్లా వాసి కె.భాస్కర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై సిటీ సైబర్ ఠాణాలో రెండు కేసులు నమోదై ఉండగా.. తన స్వస్థలంలో రిజిస్టర్ అయిన కేసులో శిక్ష సైతం పడినట్లు అధికారులు తెలిపారు. ఇతగాడి బాధితుల జాబితాలో నగరానికి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ సైతం ఉండటం గమనార్హం. భాస్కర్‌ను మంగళవారం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
వివరాలు భద్రపరిచి..
జనగామ జిల్లా లింగాలఘణపురం సమీపంలోని నేలపోగుల ప్రాంతానికి చెందిన కంధగట్ల భాస్కర్ ఎంకాం చదివాడు. కొన్నాళ్ల పాటు ఆరోగ్యశ్రీ విభాగంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిగా పని చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ కంపెనీల్లోనూ విధులు నిర్వర్తించినా ప్రస్తుతం స్వస్థలంలో వ్యవసాయం చేస్తున్నాడు. ప్రభుత్వం అందించే వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను అధికారిక పోర్టల్ అయిన ‘తెలంగాణ స్టేట్ ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం’లో ప్రదర్శిస్తారు. లబ్ధిదారుడి పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో పాటు పాస్‌పోర్ట్ ఫొటోతో కూడిన ఈ వివరాలు గత ఏడాది వరకు పోర్టల్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికీ కనిపించేవి. ప్రస్తుతం మాత్రం కొన్ని వివరాలు పొందుపరిస్తేనే కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే ఈ వివరాల్లో యువతులు, మహిళలకు చెందినవి కాపీ చేసి తన వద్ద భద్రపరిచి పెట్టుకున్న భాస్కర్ వాటిని దుర్వినియోగం చేశాడు. తనకు దొరికిన సిమ్‌కార్డును రీచార్జ్ చేసి, ‘అవసరమనప్పుడు’ తన సెల్‌ఫోన్‌లోనే వేసి వినియోగిస్తున్నాడు.
అసభ్య సందేశాలు పంపిస్తూ..
సదరు పోర్టల్ నుంచి సేకరించిన నంబర్లలో ఏదో ఒకదానికి కాల్ చేసేవాడు. అవతలి వారిలో అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్‌లో అభ్యంతరకర, అసభ్య సందేశాలు పంపడం, అశ్లీల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండేవాడు. వేళకాని వేళల్లో నగ్నంగా ఉండి యువతులు, మహిళలకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసే భాస్కర్.. వారూ అలా మారాలని బలవంతపెట్టేవాడు. పోర్టల్ నుంచి సేకరించిన ఫొటో, వివరాలను వారికి పోస్టు చేసి.. తమ వద్ద బాధితులకు సంబంధించిన ఇతర, వ్యక్తిగత అంశాలు, ఫొటోలు ఉన్నాయని బెదిరించేవాడు. తాను చెప్పినట్లు చేయకపోతే అవన్నీ సోషల్‌మీడియాలో పెడతానంటూ బెదిరించేవాడు. అనంతరం ఫోన్ నుంచి ఆ సిమ్‌కార్డు తీసేసి తన మామూలు కార్డు వేసుకుని వాడుకునేవాడు.
బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి..
భాస్కర్ వేధింపుల బారినడిన వారిలో సిటీలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న యువతి కూడా ఉన్నారు. ఈమె గతంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిపొంది ఉండటంతో ఆ పోర్టల్‌లోకి వివరాలు వెళ్లాయి. ఇతడిపై గత ఏడాది ఓ కేసు నమోదై ఉండగా.. ఇటీవల మరో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు, ఎస్సై మహిపాల్ సాంకేతిక ఆధారాలను బట్టి భాస్కర్ నిందితుడిగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన అధికారులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం వాట్సాప్ కాల్స్‌కు భాస్కర్ వినియోగిస్తున్న సిమ్‌కార్డు దాదాపు ఏడాదిగా అతడి వద్ద ఉంది. దీంతో ఇతడి బారినపడిన వారిలో రాజధానిలోని మూడు కమిషనరేట్లతో పాటు ఇతర జిల్లాలకు చెందిన అనేక మంది ఉంటారని అనుమానిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. భాస్కర్‌పై 2007లోనే లింగాలఘణపురంలో ఈ తరహా కేసు నమోదైంది. ఈ కేసులో ఇతడిని దోషిగా తేల్చిన కోర్టు రెండేల్ల జైలు శిక్ష కూడా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment