
సాక్షి, విశాఖపట్నం: చేసేది డ్రైవర్ ఉద్యోగం.. కానీ డాక్టర్‌నంటు యువతులతో పరిచయాలు ఏర్పరచుకుని లోబరుచుకునేవాడు. తర్వాత వేధింపుల పర్వానికి తెరతీసి.. వారి నుంచి నగలు, నగదు దోచుకునేవాడు. విశాఖలో వైద్యుడిగా చలామణీ అవుతూ మహిళలను ముగ్గులోకి దింపి వేధింపులకు గురి చేసిన మోసగాడి గుట్టు రట్టయింది. 20 మంది యువతులు ఆ మాయగాడి బారిన పడినట్లు పోలీసులు గుర్తించారు. కంచరపాలెంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తప్పుడు వివరాలతో ఓ ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. వైద్యుడిగా పరిచయం చేసుకుని యువతులను లోబరుచుకునేవాడు. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు గురి చేస్తుండేవాడు.
ఈ విధంగా యువతలను బెదిరించి పెద్ద ఎత్తున బంగారు నగలు, భారీగా నగదు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా వారి స్నేహితుల్ని తన లైంగిక వాంఛలు తీర్చేలా చేయాలని బాధితులను ఒత్తిడి చేసేవాడు. మాయగాడి వలలో పడిన బాధితురాలొకరు నేరుగా నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. సుమారు ఆరు నెలలుగా ఈ తతంగమంతా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కంచరపాలెంలో నాలుగురోజుల క్రితం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment