అమీర్‌పేట: అమీర్‌పేట పరసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్నేహితుడే కత్తితో గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌పార్కు హోటల్ ఎదుట ఫుట్‌పాత్‌పై గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపిన మేరకు.. కర్నాకట రాష్ట్రం గుల్బర్గాకు చెందిన షేక్ మోసిన్ (35) భార్య దివ్యతో కలిసి అమీర్‌పేట పరిసర ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లనే ఆవాసాలుగా చేసుకుని నివాసముంటున్నారు. చిత్తు కాగితాలు ఏరుకోవడంతో పాటు అడ్డా కూలిగా కూడా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరితో పాటు బోరబండకు చెందిన అబ్బు అలియాస్ గోర చిత్తు కాగితాలు ఏరుకునేవాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో గ్రీన్‌పార్కు హోటల్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై మోసిన్, అతని భార్య దివ్య, అబ్బు ముగ్గురు కలిసి మద్యం తాగారు. కాసేపటికి దివ్య పెరుగు తేచ్చేందుకు సమీపంలోని షాపునకు వెళ్లింది.
ఆమె వచ్చేసరికి భర్త మోసిన్ రక్తపు మడుగులో పడికనిపించాడు. స్థానికుల సాయంతో దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 11 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. దివ్య షాపుకు వెళ్లిన సమయంలో ఇరువురి మద్య వాగ్వివాదం జరిగింది. అబ్బు ఆవేశంతో కత్తితో గొంతు భాగంలో కోసి హత్యచేసి పారిపోయాడు. గొంతులో కత్తి లోతుగా తెగడం, తీవ్ర రక్తస్రావం జరిగడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మోసిన్ కత్తిపోట్లకు గురై దాదాపు అరగంట వరకు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నా ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే వీరి మధ్య గొడవకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మోసిన్ దివ్యను ప్రేమించి మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. గతంలో రాత్రి మద్యం సేవించి మోసిన్, దివ్య పడుకున్నాక అబ్బు దివ్య పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. గమనించిన మోసిన్ అబ్బును కాలుతో తన్నాడు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న అబ్బు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్‌పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment