
ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వరరావు
విజయనగరం లీగల్ : ఇద్దర సోదరుల మధ్య ఆస్తి తగాదా నిండు ప్రాణాన్ని బలిగొంది. మనస్తాపానికి గురై స్థానిక గౌడవీధికి చెందిన బండారు పైడి వెంకటేశ్వరరావు (51) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి టూటౌన్ ఎస్సై అశోక్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణంలోని మూడు లాంతర్ల సమీపంలో వెంకటేశ్వరరావు పాన్‌షాపు నిర్వహిస్తున్నాడు. మూడేళ్ల కిందట అతని తల్లిదండ్రులతో పాటు భార్య, పెద్ద కుమార్తె మృతి చెందారు. అనంతరం సోదరుడు వాసు ఆస్తి పంచాలంటూ తరచూ వేంకటేశ్వరరావును వేధించసాగాడు.
కొంతకాలం గడిచాక పెద్దల సమక్షంలో పంచుకుందామన్నా వినకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం పాన్‌షాపు నుంచి ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లిపోయి తలుపేసుకున్నాడు.
శుక్రవారం ఉదయం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, స్థానికులు కిటికీలోంచి చూడగా, వెంకటేశ్వరరావు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై అశోక్ సిబ్బంది కలిసి సంఘటనా స్థలానికి చేరుకని పరిస్థితిని సమీక్షించారు.
పోలీసులకు లభించిన సూసైడ్ నోట్‌లో ఆస్తి పంపకాలకు సంబంధించి తమ్ముడు వాసు వేధింపుల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఉంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సోదరుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment