హైవే పెట్రోలింగ్ వాహనం ఎక్కిస్తున్న సిబ్బంది, స్థానికులు
కాశీబుగ్గ: అత్తమ్మ ఆస్పత్రిలో ఉండటంతో ఆమెను చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా లారీ ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదాల జంక్షన్‌గా పేరుపొందిన కోసంగిపురం జాతీయరహదారి కూడలి వద్ద ఈ విషాదకర సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందస మండలం బహాడపల్లి పంచాయతీ నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన తిమ్మల పాపారావు(35).. అత్తయ్య కాశీబుగ్గలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను చూసేందుకు మందస నుంచి కాశీబుగ్గకు స్కూటీపై వెళ్లారు. ఆమెను పరామర్శించి మందస వస్తుండగా కోసంగిపురం కూడలి వద్ద సాయంత్రం 5గంటల సమయంలో జాతీయ రహదారి దాటుతుండగా పాపారావు ద్విచక్రవాహనాన్ని లారీ(ఏపీ 30 టీటీ 0479) వేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పాపారావు తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు ‘108’కు సమాచారం అందించారు. అప్పటికీ వాహనం రాకపోవడంతో.. హైవే పెట్రోలింగ్ వ్యానులో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్కూటీని ఢీకొట్టిన లారీని స్థానికంగా ఓ యువకుడు వెంబడిచి 1వ వార్డు మెగిలిపాడు వంతెన దాటుతుండగా పట్టుకున్నారు. ఇంతలో యువకుడిని పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర వైద్యం అందించినప్పటికీ తలకు తీవ్ర గాయమవడంతో అక్కడే మరణించారు. పాపారావు అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ట్రాఫిక్ ఏఎస్‌ఐ అప్పలరాజు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు కూలి పనిచేస్తూ కుటుంబానికి జీవిస్తున్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకుని మూడేళ్ల క్రితం మరో వివాహం చేసుకున్నారు. రెండవ భార్యతో నల్లబొడ్లూరులో జీవిస్తున్నారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. పెద్ద దిక్కు కోల్పోవడంతో .. ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment