యాదగిరి(ఫైల్)
బన్సీలాల్‌పేట్: చిన్నపాటి ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన వృద్ధుడిని తండ్రీకొడుకు కలిసి చితకబాదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కవాడిగూడ కల్పన థియేటర్ సమీపంలో కోదండరెడ్డినగర్ బస్తీకి చెందిన శివ ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులతో ఘర్షణ పడుతున్నాడు. అదే సమయంలో బయటికి వచ్చిన యాదగిరి అనే ఆటో డ్రైవర్ అక్కడి వెళ్లి ఇద్దరికి సర్ధిచెప్పి పంపించి వేశాడు. కాగా ఒకే బస్తీకి చెందిన యాదగిరి, శివ కుటుంబాల మధ్య గతంలో పార్కింగ్ విషయమై గొడవలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఘర్షణలో యాదగిరి జోక్యం చేసుకోవడం సహించలేని శివ తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. శివ తండ్రి శ్రీనివాసులు, తల్లి లక్ష్మి అక్కడికి వచ్చి యాదగిరితో గొడవకు దిగారు. శివ, యాదగిరి ఛాతిలో పిడిగుద్దులు గుద్దడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న యాదగిరి భార్య మణెమ్మపై కూడా శివ దాడి చేసినట్లు సమాచారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసులు, శివ, లక్ష్మీలపై నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ నేర్కొన్నారు. మృతుడు యాదగిరి రాణిగంజ్‌లో ఆటోట్రాలీ నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా, నిందితుడు శ్రీనివాసులు జీహెచ్‌ఎంసీ చెత్తబండి నడుపుతున్నాడు. గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment