మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి, శివ్వంపేట(నర్సాపూర్ ): అప్పటి వరకు పెళ్లి సంబరాల్లో అనందంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అక్క పెళ్లి వేడుకల్లో భాగంగా బావగారింటి వద్ద నిర్వహించిన భరాత్‌లో ఉత్సాహంగా పాల్గొన తమ్ముడు గుండెపోటుకు గురై మృతిచెందిన విషాదకర సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం తాళ్లపల్లితండా పంచాయతీ పరిధి శంకర్ తండాకు చెందిన లాకావత్ బుజ్జి తారాసింగ్ దంపతులకు కూతురు నీతా, కొడుకు నరేందర్(20) ఉన్నారు. నీతా పెళ్లి సోమవారం కౌడిపల్లి మండలం బుర్గుగడ్డకు చెందిన మేనబావతో శంకర్ తండాలో ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు. సాయంత్రం తండాలో భరాత్ నిర్వహించి అప్పగింతల కార్యక్రమం అనందంగా నిర్వహించారు.
బుర్గుగడ్డలో రాత్రి భరాత్ నిర్వహిస్తుండడంతో అక్కడికి స్నేహితులతో కలిసి నరేందర్ వెళ్లాడు. అక్కబావల భరాత్‌లో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో అస్వస్థతకు గురైనాడు. కొద్దిసేపు సేదతీరిన అనంతరం మాములు స్థితికి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటికి ఛాతిలో నొప్పిగా ఉందని స్నేహితులతో చెప్పడంతో బైక్‌పై కౌడిపల్లిలోని క్లినిక్ తీసుకెళ్లగా నర్సాపూర్ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే అందుబాటులో లేకపోవడంతో బైక్ పైనే నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో అప్పటికే మృతిచెందాడు.
పెళ్లి వేడుకల్లో అనందంగా గడిపిన కుటుంబం నరేందర్ అకస్మాతుగా మృతిచెందడంతో విషాధచాయలు అలుముకున్నాయి. నరేందర్ తూప్రాన్‌లోని స్నేహ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శంకర్ తండాలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించగా పలువురు ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత సంవత్సరం శివ్వంపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన నరేందర్ మృతి పట్ల విద్యార్థులు మౌనం పాటించి పాఠశాలకు సెలవు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment